Pakistan minister prediction that Congress alliance will win in Kashmir : భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ.. కాంగ్రెస్ , నేషనల్ కాన్ఫరెన్స్‌కు  మద్దతుగా పాకిస్తాన్ రక్షణ మంత్రి అసిఫ్ చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరి.. కాంగ్రెస్ వైఖరి ఒకేలా ఉన్నాయని ఆయన తేల్చేశారు. పాకిస్థాన్ వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు. కశ్మీర్ లో ఉగ్రవాదం ఎగదోసేది పాకిస్థాన్.. మొత్తంగా కశ్మీర్ ను భారత్ నుంచి విడగొట్టాలనేది పాకిస్తాన్ వైఖరి. కాంగ్రెస్ ది కూడా అదే వైఖరి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేయడం ఇండియాలోనూ వైరల్ గా మారింది. పాకిస్తాన్ మీడియా సంస్థ జియో న్యూస్ తో  అసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


జమ్మూ  కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసేసిన తర్వాత రాష్ట్ర విభజన చేశారు. ఇప్పుడు   అక్కడ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ కూటమికి విజయావకాశాలు ఉంటాయని వారు గట్టిగా నమ్మకం పెట్టుకున్న దశలో.. పాకిస్తాన్ నుంచి వచ్చిన సపోర్టు.. అతి పెద్ద మైనస్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కశ్మీర్ ను పూర్తి స్థాయిలో భారత్ లో విలీనం చేశారు. అంతకు ముందు కశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. అక్కడి అసెంబ్లీకి ఆరేళ్ల  పదవీ కాలం ఉండేది. కానీ ఇలాంటి ప్రత్యేకమైన హోదాలన్నింటినింటీ ఆర్టికల్ 370 రద్దుతో రద్దు చేసేశారు. ఇప్పుడు కశ్మీర్ కూడా...మిగతా రాష్ట్రాలతో సమానం. కానీ కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్  370 రద్దుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తోంది. కానీ తప్పు అని చెప్పడం లేదు. 


బెంగళూరు ఇండియాలో లేదా ? కర్ణాటకలో పీయూష్ గోయాల్ వ్యాఖ్యల దుమారం


ఇప్పుడు కాంగ్రెస్ పార్టీదే మా వైఖరి అని చెప్పడం ద్వారా పాకిస్తాన్  వాదనకు కాంగ్రెస్ మద్దతుగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది. ఇలాంటి అవకాశాన్ని బీజేపీ వదులుకునే అవకాశమే లేదు. అందుకే  బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. పాకిస్థాన్ లాంటి ఉగ్రదేశం.. కశ్మీర్ విషయంలో ఎప్పుడూ కుట్రలు చేసే పాకిస్తాన్.. కాంగ్రెస్ కు మద్దతు పలికిందని..ఇద్దరూ కలిసి కశ్మీర్ పై కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ తెరపైకి వస్తున్నారు. కశ్మీర్ ప్రజలు ఆర్టికల్ 370ని కోరుకుంటున్నారని.. తాము గెలిస్తే మళ్లీ ఆర్టికల్ 370ని తెస్తామని ఫరూక్ అబ్దుల్లా ప్రకటిస్తున్నారు అయితే కాంగ్రెస్ మాత్రం ఈ అంశంలో ఎలాంటి ప్రకటన చేయడం లేదు. 


నెయ్యి కాంట్రాక్టర్‌ను మార్చడంతోనే అసలు సమస్య - తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా ?


కాంగ్రెస్‌కు మద్దతుగా  పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఒక్క కశ్మీర్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ .. తమకు పాకిస్తాన్ వైపు లభించిన మద్దతు ను ఖండించి.. కశ్మీర్ విషయంలో , ఆర్టికల్ 370 విషయంలో తమ వాదనను స్పష్టం చేయకపోతే .. దేశంలోని ఇతర చోట్ల కూడా  నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అంచనా  వేస్తున్నారు.