Blasphemy in Pakistan:
పాక్‌లో ఘటన..
పాకిస్థాన్‌లో దైవదూషణను చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దేవుడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన శిక్షలు వేస్తారు. ఈ విషయంలో చాలా కచ్చితంగా ఉంటుంది అక్కడి ప్రభుత్వం. అది మరోసారి రుజువైంది. దైవదూషణ చేసిన ఓ వ్యక్తికి యాంటీ టెర్రరిజం కోర్టు మరణ శిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గ్రూప్‌లలో దేవుడిని దూషిస్తూ మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసినందుకు ఈ శిక్ష విధించింది. పెషావర్‌లోని కోర్టు ఈ తీర్పునిచ్చింది. మరణశిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించింది. రూ.12 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అయితే..ఈ తీర్పుని రద్దు చేసేందుకు అప్పీల్ చేసుకునే అవకాశం బాధితుడికి ఉంటుంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ వ్యక్తి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం వాట్సాప్ గ్రూప్‌లలో దేవుడిని దూషిస్తూ కొన్ని మెసేజ్‌లు పంపాడని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపిన కోర్టు...ఆ నిందితుడిని దోషిగా తేల్చింది. అయితే..పాక్‌లో ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉంటాయి. ముస్లింలే తోటి ముస్లింలను తీవ్ర పదజాలంతో తిడుతుంటారు. కొన్నిసార్లు క్రిస్టియన్లు కూడా ఈ వివాదాల్లో చిక్కుకుని శిక్షకు గురవుతుంటారు. కొందరు వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకూ ఇలాంటి కేసుల్లో ఇరికిస్తుంటారు. 20 ఏళ్లలో పాకిస్థాన్‌లో 774 మందిపై దైవదూషణ ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని అక్కడి నేషనల్ కమిషన్ ఆఫ్ జస్టిస్ అండ్ పీస్ సంస్థ వెల్లడించింది.
వింత చట్టాలు..
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో ప్రపంచమంతా గమనిస్తోంది. ఉగ్రదాడులూ పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణంతో ప్రజలు సతమతం అవుతున్నారు. ప్రభుత్వం ఏం చేయాలో తెలియక చేతులెత్తేసింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా పాకిస్థాన్ పేరు మారుమోగుతోంది. అసలు అక్కడి విధానాలేంటి..? చట్టాలేంటి..? అని ఆరా తీస్తున్నారంతా. ఈ అన్వేషణలో ఆ దేశంలోని కొన్ని వింత చట్టాలు వెలుగులోకి వచ్చాయి. ఆ చట్టాలేంటో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఒకటుంది. ఏంటంటే.. పాకిస్థాన్‌లో ఎవరైనా సరే వేరే వాళ్ల ఫోన్‌ను ముట్టుకోకూడదు. అలా చేశారా...వెంటనే శిక్ష విధిస్తారు. అనుమతి లేకుండా ఫోన్ తీసుకుంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. పైగా 6 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాలి. అంతే కాదు. అక్కడ అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి జీవించేందుకు వీల్లేదు. అంటే లివిన్ రిలేషన్‌షిప్‌లు కుదరవన్నమాట. పెళ్లికి ముందే ఇలా కలిసున్నారని తెలిస్తే ఇద్దరినీ జైలుకు పంపుతారు. ఇప్పుడు మరో చట్టం గురించి చెప్పుకుందాం. సాధారణంగా పాకిస్థాన్‌లో అక్షరాస్యత చాలా తక్కువ. అయితే...అక్కడ కొన్ని పదాలను ట్రాన్స్‌లేట్ చేయటం చాలా పెద్ద నేరం. అల్లా, మసీద్, రసూల్, నబీ అనే పదాలను ఇంగ్లీష్‌లోకి అనుమతించడాన్ని పాక్ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తుంది. అవి ఎలా ఉన్నాయో అలానే రాయాలి తప్ప వాటిని అనువదించకూడదు. అలా కాదని రూల్ బ్రేక్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు.