Congress Sankalp Satyagraha:


రాజ్‌ఘాట్ వద్ద బందోబస్తు


రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడంపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. రెండ్రోజుల నుంచి పలు రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. అధిష్ఠానం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. దేశవ్యాప్తంగా "సంకల్ప్ సత్యాగ్రహ" నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు అన్ని చోట్లా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సత్యాగ్ర దీక్ష చేసేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారు. కానీ నిరసన మొదలు పెట్టిన కాసేపటికే పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని దీక్షను విరమించాలని చెప్పారు. ఈ క్రమంలోనే ఎలాంటి ఆందోళనలు జరగకుండా రాజ్‌ఘాట్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. అదానీ వ్యవహారంపై పదేపదే మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కేందుకే బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపైనా అసహనం వ్యక్తం చేస్తోంది. బీజేపీ మాత్రం తప్పనిసరిగా రాహుల్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. అయితే...ఈ సత్యాగ్రహ దీక్షపై బీజేపీ విమర్శలు చేస్తోంది. జగదీశ్ టిట్లర్‌ ఈ నిరసనల్లో పాల్గొనడాన్ని బట్టే కాంగ్రెస్ వైఖరేంటో అర్థమవుతోందని మండి పడుతోంది. బీజేపీ నేత ఆర్‌పీ సింగ్ దీనిపై స్పందించారు. 


"వాళ్లు ఎలాంటి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. సిక్కులను ఊచకోత కోసిన జగదీశ్ టిట్లర్‌ ఈ దీక్షలో పాల్గొన్నారు. ఆయన లేకుండా కాంగ్రెస్ ఉండలేదు. ప్రతి కాంగ్రెస్ సమావేశంలోనూ ఆయనకు ఆహ్వానం అందుతోంది. ఇది సత్యాగ్రహ దీక్షలా లేదు. సిక్కులను చంపిన టిట్లర్‌ను మరోసారి రెచ్చగొడుతున్నట్టుగా ఉంది"


- ఆర్‌పీ సింగ్, బీజేపీ నేత 


అటు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ విమర్శలపై గట్టి బదులు ఇస్తున్నారు. రాహుల్ గాంధీని బీజేపీ మాట్లాడనివ్వడం లేదని ఖర్గే ఆరోపించారు. అయినా ప్రజల హక్కుల కోసం రాహుల్ తన పోరాటాన్ని ఆపరని స్పష్టం చేశారు. 


"రాహుల్ గాంధీని మాట్లాడకుండా బీజేపీ అడ్డుకుంటోంది. ఆయన దేశం కోసం పోరాడుతున్నారు. ప్రజల  హక్కులు కాపాడేందుకు పోరాటం చేస్తున్నారు. ఇది ఎప్పటికీ ఆగదు. అందుకే సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నాం"


- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు