Khalistan Issue:


ఎంబసీ వద్ద నిరసనలు..


ఖలిస్థాన్ మద్దతుదారుల ఆందోళనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కెనడాలో పలు చోట్ల హిందూ ఆలయాలపై దాడులు చేశారు. వందలాది మంది గుమిగూడి నినాదాలు చేశారు. అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్‌ పోలీసులు దాదాపు పది రోజులుగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో మరోసారి ఖలిస్థాన్ వేర్పాటు వాదుల ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నిరసనలను కవర్ చేయడానికి వెళ్లిన ఇండియన్ జర్నలిస్ట్‌పై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో తలపై గట్టిగా కొట్టారు. వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీ బయట ఉద్యమిస్తున్న వారితో మాట్లాడాడు ఇండియన్ జర్నలిస్ట్ లలిత్ ఝా. భారత దేశంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉద్యమకారులు...ఆ తరవాత లలిత్‌ను కొట్టాడు. భారత ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో దూషించారు. జర్నలిస్ట్‌పై దాడులు చేసిన వెంటనే యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు అక్కడికి వచ్చి ఆయనను కాపాడారు. ఎడమ వైపు చెవిపైన కర్రలతో గట్టిగా కొట్టారని, అధికారులు వచ్చి తనను రక్షించినందుకు థాంక్స్ అని చెప్పారు లలిత్ ఝా. ఈ మేరకు ట్వీట్ చేశారు. 


"సీక్రెట్ సర్వీస్ అధికారులకు థాంక్స్. నా బాధ్యతలు నేను నిర్వర్తించేందుకు సహకరించడమే కాకుండా నన్ను కాపాడారు. లేదంటే ఇదంతా నేను  హాస్పిటల్‌లో కూర్చుని రాయాల్సి వచ్చేది. ఓ వ్యక్తి రెండు కర్రలతో నా ఎడమ చెవిపై గట్టిగా కొట్టాడు. వెంటనే నేను పోలీసులకు కాల్ చేశాను. వాళ్లు వచ్చి వ్యాన్‌లో ఎక్కించుకున్నారు. దాడుల నుంచి నన్ను తప్పించారు"


- లలిత్ ఝా, ఇండియన్ జర్నలిస్ట్ 


ఖండించిన భారత్..


దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఖలిస్థాన్ మద్దతుదారులు తరచూ వాషింగ్టన్‌లో ఇలాంటి ఆందోళనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసకు పాల్పడుతున్నారని మండి పడింది. అయితే...ఆ జర్నలిస్ట్ మాత్రం వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇండియన్ ఎంబసీని కూడా ధ్వంసం చేస్తామని వాళ్లు హెచ్చరించినట్టు వివరించారు. అమృత్ పాల్‌ సింగ్‌కు మద్దతుగా నినాదాలు చేసిన నిరసనకారులు...ఖలిస్థాన్ జెండాలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వాషింగ్టన్‌లోనే కాదు. శాన్‌ఫ్రాన్సిస్కోలోనూ ఖలిస్థాన్ మద్దతుదారులు అలజడి సృష్టించారు. మార్చి 20న ఇండియన్ ఎంబసీపై దాడులు చేశారు. అద్దాలు, తలుపులు పగలగొట్టారు. ఖలిస్థాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. అమెరికా కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. దౌత్యాధికారులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం అమృత్‌ పాల్‌ సింగ్‌ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హరియాణాలో ఉన్నట్టు సమాచారం అందింది. అయితే...అక్కడి నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి దాదాపు 8 రాష్ట్రాల పోలీసులు అలెర్ట్ అయ్యారు.