రెడ్ వెల్వెట్ కేకు, చికెన్ మెజెస్టిక్, పన్నీర్ మెజిస్టిక్, బిర్యానీలు.... ఇలా చాలా వంటకాల్లో రెడ్ ఫుడ్ కలర్‌ను వినియోగిస్తారు. అవి చూడడానికి నోరూరించేలా ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఆ రెడ్ ఫుడ్ కలర్ దేనితో తయారు చేస్తారు అని? దాన్ని ఏ పదార్థంతో తయారు చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు. కొంతమంది తినడం కూడా మానేస్తారు.
రెండు రకాలు
సైన్స్ ప్రకారం రంగులు సానుకూల భావోద్వేగాలను, సంతోషాన్ని రేకెత్తించేలా మనసుపై ప్రభావాన్ని చూపిస్తాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ చేసిన అధ్యయనం ప్రకారం ఎరుపు, నారింజ, పసుపు వంటివి వెచ్చని రంగులు. అవి ప్రేమ, ఆనందం, అభిరుచి వంటి భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. అయితే ఈ రంగుల తయారీలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సహజంగా ఏర్పడేవి, రెండు కృత్రిమమైనవి. సహజ ఆహార రంగులను, పండ్లు, కూరగాయలు, పువ్వుల నుంచి సేకరించిన సారంతో తయారుచేస్తారు. ఉదాహరణకు బీట్రూట్ నుంచి పింకు రంగును తయారు చేయవచ్చు. పసుపు రంగు పండ్లు, కూరగాయలు, పూల నుంచి... పసుపు రంగును తయారు చేయొచ్చు. అయితే ఎక్కువగా రసాయనాల మిశ్రమంతో తయారయ్యే కృత్రిమ రంగులే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర తక్కువగా ఉంటుంది. కృత్రిమ రసాయనాలు కలిపిన రంగులను వాడడం వల్ల డిప్రెషన్, అనేక రకాల క్యాన్సర్లు, పిల్లల్లో ఆటిజం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎరుపు రంగు ఎలా తయారు అవుతుంది?
రెడ్ ఫుడ్ కలర్‌ను కార్మైన్ అని కూడా పిలుస్తారు. ఎన్నో రెస్టారెంట్లలో కృత్రిమమైన ఎరుపు రంగునే వాడతారు. ఈ ఎరుపు రంగు లాటిన్ అమెరికాకు చెందినది. అక్కడ కొచినియల్ అని పిలిచే ఎరుపు రంగు పురుగు ఉంటుంది. ఆ పురుగు నుంచి సారాన్ని తీస్తారు. ఆ సారంతో ఎరుపు రంగు ఫుడ్ కలర్ తయారుచేస్తారు. ఇందుకోసం లక్షల కొద్ది పురుగులను సేకరిస్తారు. ఉదాహరణకు ఒక పౌండ్ కృత్రిమ ఎరుపు రంగును తయారు చేయడానికి 70 వేల పురుగులు అవసరం పడతాయి. కాబట్టి ఆ రెడ్ ఫుడ్ కలర్ శాఖాహారమా? మాంసాహారమా అనేది తినే వారే ఆలోచించుకోవాలి.
సురక్షితమేనా?
లైఫ్ సైన్స్ అనే సైన్స్ జర్నల్ చెబుతున్న ప్రకారం 2009లో కొచినియల్ పురుగుల నుంచి తయారు చేసే ఈ ఆహార రంగును సహజరంగుగానే పరిగణించడం మొదలుపెట్టారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాల ప్రకారం ఈ పురుగు నుంచి తయారు చేసే సారం తరచుగా వాడటం వల్ల ఆహార అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఫుడ్ కలర్స్ కు దూరంగానే సహజ పద్ధతిలో ఇంట్లో ఉండుకుని తినడమే ఉత్తమం. రెడ్ ఫుడ్ కలర్ వాడిన ప్రతి ఆహార పదార్ధం మాంసాహారమే అని అర్థం చేసుకోవాలి.
Also read: ఈ అరటిపండు తింటే మధ్యాహ్నం మీల్స్ తిన్నట్టే, ఒక్క పండుకే పొట్ట నిండిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.