Priyanka Gandhi:
బీజేపీపై ఫైర్..
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. రాహుల్‌పై అనర్హతా వేయడంపై కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆమె బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని తేల్చి చెప్పారు. పదేపదే బీజేపీ కుటుంబ రాజకీయాలు అంటూ ఎగతాళి చేయడంపైనా మండి పడ్డారు. రాజ్య ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన శ్రీరాముడు, పాండవులకూ పరివార వాదం అంటకడతారా అంటూ ప్రశ్నించారు.
"మొత్తం ప్రభుత్వం అంతా కలిసి అదానీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పదేపదే ప్రధాని పరివారవాదం గురించి మాట్లాడుతూ ఎగతాళి చేస్తుంటారు. నా ప్రశ్న ఒక్కటే. శ్రీరాముడు ఎవరు..? ఆయన కూడా కుటుంబ వాదేనా..? తమ కుటుంబం కోసం పోరాటం చేసిన పాండవులనూ పరివార వాదులు అందామా..? దేశం కోసం పోరాటం చేసిన కుటుంబ సభ్యులను చూసి మేం సిగ్గు పడాలంటారా..? ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు మా కుటుంబం అంతా రక్తం ధార పోసింది"
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకీ దిగజారిపోతోందని విమర్శించిన ప్రియాంక...కేవలం ఒకే ఒక వ్యక్తిని రక్షించేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతో మంది తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మా తండ్రిని పార్లమెంట్ సాక్షింగా అవమానించారు. నా సోదరుడిని మీర్ జాఫర్‌తో పోల్చారు. మీ మంత్రులంతా కలిసి పార్లమెంట్‌లో మా అమ్మను కించపరిచారు. ఓ ముఖ్యమంత్రి రాహుల్‌కు తన నాన్న ఎవరో కూడా తెలియదంటూ అనుచితంగా మాట్లాడారు. అలాంటి వాళ్లపై ఏ చర్యలూ తీసుకోలేదు. వాళ్లపై అనర్హతా వేటు వేయలేదు. వాళ్లు జైలుకు వెళ్లలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోనూ లేదు. మా కుటుంబాన్ని ఎన్నోసార్లు అవమానించారు. అయినా ఇన్నాళ్లు మేం మౌనంగానే భరించాం."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
తమ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోకుండా బీజేపీ పదేపదే విమర్శలు చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ. బీజేపీపై ఎలాంటి విద్వేషం లేదని, ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో చెప్పారని అన్నారు.
"ఓ సారి పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లాడు. ఆయనను కౌగిలించుకున్నాడు. మోదీపై ఎలాంటి విద్వేషం లేదని నవ్వుతూ చెప్పారు. మా ఆలోచనా విధానం వేరు కావచ్చు. కానీ మాకెవరిపైనా విద్వేషం ఉండదు. అది మా వైఖరి కాదు."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
Also Read: Khushbu Old Tweet: ఖుష్బూని టార్గెట్ చేసిన కాంగ్రెస్, పాత ట్వీట్‌ను వైరల్ చేస్తూ విమర్శలు