Khushbu Old Tweet:


2018లో ట్వీట్..


బీజేపీ నేత ఖుష్బూ సుందర్ చిక్కుల్లో పడ్డారు. 2018లో ఆమె చేసిన ట్వీట్‌ను ఇప్పుడు వైరల్ చేస్తూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. "అప్పుడలా..ఇప్పుడేమో ఇలా" అంటూ రెండు ట్వీట్‌లను పోల్చుతూ మండి పడుతోంది. ఇంతకీ జరిగిందేంటంటే...2018లో కాంగ్రెస్‌లో ఉన్నారు ఖుష్బూ. అప్పట్లో మోదీకి వ్యతిరేకంగా ఓ ట్వీట్ చేశారు. లలిత్ మోదీ, నీరవ్‌ మోదీ, నరేంద్ర మోదీలను పోల్చుతూ ఆమె అప్పట్లో ఓ పోస్ట్ చేశారు. 


"చూడండి. మోదీ ఎక్కడున్నారో అక్కడే మోదీలు ఉన్నారు. కానీ అదేంటో మోదీ అనే ఇంటి పేరు కేవలం దొంగలకే ఉంది. మోదీ అనే పేరుని అవినీతి అని మార్చేయడం మంచిదేమో. నీరవ్, లలిత్, నరేంద్ర మోదీలకు ఇదే కరెక్ట్. నరేంద్ర మోదీ అంటేనే అవినీతి"


- ఖుష్బూ సుందర్, 2018లో చేసిన ట్వీట్ 






ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. ట్విటర్ బయోలే "మోదీ ఫర్ ఇండియా" అని రాసుకున్నారు. ఇప్పుడు ఈ బయోనే టార్గెట్ చేసుకుంది కాంగ్రెస్. అప్పుడేమో మోదీ అంటే అవినీతి అని ట్వీట్‌లు చేసి..ఇప్పుడేమో మోదీ ఫర్ ఇండియా అని అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వరుసగా అందరూ ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై ఖుష్బూ సుందర్ స్పందించక తప్పలేదు. తన పాత ట్వీట్‌లను తవ్వి తీస్తుండటాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ఎంత అసహనంగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. 


"నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మోదీపై చేసిన ఆ ట్వీట్ విషయంలో నేనేమీ సిగ్గు పడడం లేదు. అప్పటికి మా లీడర్ ఆదేశాల మేరకు నడుచుకున్నాను. ఆ పార్టీ గొంతుకనే వినిపించానంతే"


- ఖుష్బూ సుందర్, బీజేపీ నేత 






జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎన్నికైన ఖుష్బూ..2020లో బీజేపీలో చేరారు. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసిన తరవాత బీజేపీపై అటాక్ మొదలు పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే...ఖుష్బూని టార్గెట్ చేసింది. రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడంపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. రెండ్రోజుల నుంచి పలు రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. అధిష్ఠానం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. దేశవ్యాప్తంగా "సంకల్ప్ సత్యాగ్రహ" నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు అన్ని చోట్లా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సత్యాగ్ర దీక్ష చేసేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారు. కానీ నిరసన మొదలు పెట్టిన కాసేపటికే పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని దీక్షను విరమించాలని చెప్పారు. ఈ క్రమంలోనే ఎలాంటి ఆందోళనలు జరగకుండా రాజ్‌ఘాట్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. 


Also Read: Rahul Gandhi Twitter Bio: రాహుల్ గాంధీ ట్విటర్ బయో గమనించారా? ఇది కూడా బీజేపీపై సెటైరేనా?