Himalayan Glaciers Melting:
వేగంగా కరిగిపోతున్న గ్లేషియర్స్..
చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వరదలు ముంచెత్తుతున్నాయి పాకిస్థాన్‌ను. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల కిలోమీటర్ల దారులు ధ్వంసమయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా..అనూహ్య స్థాయిలో వర్షపాతం నమోదవుతోందని నిపుణులు ప్రతిసారీ వివరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది..పాకిస్థాన్‌లోని వరద విలయం. కేవలం వాతావరణ మార్పులే కాదు. మరో సమస్య కూడా పాక్ నీట మునగటానికి కారణమైంది. హిమాలయాల్లోని హిమానీ నదాలు (Glaciers) కరిగిపోవటమూ...పాకిస్థాన్‌కు ఈ ప్రళయంలోకి నెట్టిందని సైంటిస్ట్‌లు చాలా గట్టిగా చెబుతున్నారు. ఇండోర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)పరిశోధకులు ఇప్పటికే ఓ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే... గతేడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడిగాలుల కారణంగా హిమాలయా ల్లోని గ్లేషియర్స్ కరిగిపోయాయి. దాదాపు 15 ఏళ్లుగా హిమాలయాల స్థితిగతులపై అధ్యయనం చేస్తోంది పరిశోధకుల బృందం. మంచుఅత్యంత వేగంగా కరిగిపోతున్నట్టు గుర్తించారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌లో 100 ఏళ్ల రికార్డులూ చెరిపేసి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ సమయంలోనే గ్లేషియర్స్ కరిగిపోవటాన్ని గమనించారు. ఈ కరిగిపోవటం కూడా చాలా వేగంగా, భారీగా జరుగుతోందన్నది పరిశోధకులు తేల్చి చెప్పిన విషయం. ఇలా కరుగుతున్నందునే...నేరుగా హిమాలయాల్లో నుంచి పాకిస్థాన్‌కు భారీగా నీరు చేరుతోందన్నది సైంటిస్ట్‌లు ఇస్తున్న వివరణ. ఈ ఫినామినాను "Glacial lake outburst"గా పిలుస్తారు.
తగ్గిపోతున్న విస్తీర్ణం..
మంచు పొరలతో ఏర్పడ్డ గ్లేషియర్స్ కొన్ని వందల కిలోమీటర్ల మేర పై నుంచి కిందక వరకూ విస్తరించి ఉంటాయి. కేవలం హిమాలయాల్లోనే కాదు. ఐరోపాలోని ఆల్ప్స్ (Alps) పర్వతాల్లోని మంచు కూడా చాలా వేగంగా కరిగిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే..హిమాలయాల్లోని నార్త్, సౌత్ పోల్స్‌లో భారీ మొత్తంలో మంచి నీరు గడ్డకట్టుకుని ఉంటుంది. ఈ మంచు అధిక ఉష్ణోగ్రతల కారణంగా కరిగిపోయి...మంచి నీళ్లన్నీ అలా వరదల్లా ముంచెత్తుతున్నాయి. వృథా అవుతున్నాయి. 2021లో ఇండోర్ ఐఐటీ పరిశోధకులు ఓ ఆందోళనకర విషయం చెప్పారు. హిమాలయాలు కరిగిపోవటం అనే ప్రక్రియ ఇంతే వేగంగా శతాబ్దాల పాటు కొనసాగితే...ఎప్పుడో అప్పుడు అక్కడ చుక్క నీరు కూడా లేకుండా పోతుందని హెచ్చరించారు. ఇక్కడ మరో విషయమూ చెప్పుకోవాలి. హిమాలయాల్లోని మంచు కరిగిపోయి నీరులా మారుతోంది. ఆ నీరు పరిసర ప్రాంతాల్లోని కోట్లాది మంది ప్రజల నీటి అవసరాలు తీర్చుతోంది. అలా అని...ఈ "మెల్టింగ్" అనేది ఇంకా వేగవంతమైతే...ఇలా వరదలు ముంచెత్తటం ఖాయం. ఇప్పుడు పాక్‌లో జరుగుతోంది ఇదే. హిమాలయాల్లో ఇప్పటికే దాదాపు 40% మేర కరిగిపోయాయి. ఫలితంగా...వాటివిస్తీర్ణం తగ్గిపోయింది. 28,000 చదరపు కిలోమీటర్ల ఎత్తులో ఉండే గ్లేషియర్స్...2021 నాటికి 19,600 చదరపు కిలోమీటర్లకు కుంగిపోయింది. ఇదే
సమయంలో 390 క్యూబిక్ కిలోమీటర్ల మేర మంచు కూడా కరిగిపోయింది. ఇప్పుడు పాకిస్థాన్‌లో మూడు కోట్ల మంది ప్రజలు వరద బాధితులుగా మారారంటే...కారణం ఇదే. బలూచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లో సాధారణ కన్నా 400% మేర అధిక వర్షపాతం నమోదైంది. పాకిస్థాన్‌లో 2010లోనూ వరదలు ముంచెత్తాయి. ఆ ధాటికి దాదాపు 2 వేల మంది మృతి చెందారు.
Also Read: Telangana News : మూడు రోజుల పాటు తెలంగాణ విలీన ఉత్సవాలు - బీజేపీకి కౌంటర్‌గా కేసీఆర్ నిర్ణయం !