Pakistan Economic Crisis:



టిమ్ హార్టోన్స్ ఔట్‌లెట్...(Tim Hortons in Pakistan)


పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. వందల రూపాయలు పోస్తే కానీ ఓ వస్తువూ కొనలేని పరిస్థితి. నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. బ్రెడ్డు కొనాలన్నా డబ్బులు చాలడం లేదు. ఇంత కష్టకాలంలోనూ ఉన్న డబ్బులన్నీ కాఫీల కోసం తగలేస్తున్నారు కొందరు. పేస్ట్రీల కోసం క్యూ కడుతున్నారు. అవి కూడా సాదాసీదావి కాదు. బ్రాండెడ్ షాప్‌లో కొనేస్తున్నారు. కెనడాకు చెందిన Tim Hortons కంపెనీ ఈ మధ్యే పాకిస్థాన్‌లో తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. అసలే ఆర్థికంగా సతమతం అవుతున్న పాకిస్థాన్‌లో ఆ కంపెనీ ఔట్‌లెట్ ఎందుకు పెట్టిందో మరి. ఎలాగో ఔట్‌లెట్ వచ్చేసింది కదా...కాఫీలు, పేస్ట్రీలు కొనేద్దాం అంటూ పాకిస్థాన్ పౌరులంతా ఆ షాప్ ముందు క్యూ కడుతున్నారు. ఈ కారణంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. నెల రోజుల్లోనే పాకిస్థాన్‌ కరెన్సీ డాలర్‌తో పోల్చితే 25%కి పైగా పడిపోయింది. పెట్రోల్ ధరలు దారుణంగా పెరిగిపోయాయి. జనవరిలో ద్రవ్యోల్బణం 27%కి చేరుకుంది. గత పదేళ్లలో ఇదే అత్యధికం. మరో మూడు వారాలకు సరిపడ ఫారెక్స్ నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ పట్టించుకోకుండానే ప్రజలు   Tim Hortons ఔట్‌లెట్ వద్ద బారులు తీరుతున్నారు. అయితే...దీనిపై ఆ కంపెనీ స్పందించింది. "డబ్బులున్న వాళ్లు ఈ ధరలు అసలు లెక్క చేయడం లేదు" అని తేల్చి చెబుతోంది. 


ఎగబడుతున్న విద్యార్థులు..
 
ఇక్కడి మెనూ ప్రకారం ఓ కాఫీ ధర రూ.350. ఇది స్మాల్‌ అయితేనే. ఇక లార్జ్ కాఫీ అయితే దీనికి రెట్టింపు కట్టాలి. అంటే రూ.700 అన్నమాట. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఈ కంపెనీ. ఫలితంగా విద్యార్థులు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారు. 
ఓ సారైనా ఇక్కడ కాఫీ తాగాలని ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా వచ్చేస్తున్నారు.