POK Merge With India:
పది రోజులుగా నిరసనలు..
పాకిస్థాన్‌లో రోజురోజుకీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఆహారం కోసం జనాలు కొట్టుకుంటున్నారు. ఆర్థికంగా కుంగిపోయారు. ఈ సమస్యలు చాలవన్నట్టు ఇప్పుడు అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టు ముడుతున్నాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని గిల్గిట్ బాల్టిస్థాన్‌లోనూ అలజడి మొదలైంది. ఇప్పటికే ఇక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వ తీరుతో విసిగిపోయారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో గిల్గిట్ బాల్టిస్థాన్‌ను విలీనం చేయాలన్న కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్గిల్ రోడ్‌ని రీఓపెన్ చేయడంతో పాటు బాల్టిస్థాన్‌ను లద్దాఖ్‌లో కలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 12 రోజులుగా అక్కడ ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గోధుమలతో పాటు మరి కొన్ని ఆహార పదార్థాలపై సబ్సిడీ ఇవ్వాలని నినదిస్తున్నారు. అంతే కాదు. సహజ వనరులను ధ్వంసం చేసే పనులు కూడా మానుకోవాలని చెబుతున్నారు. పాక్ సైన్యంపైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ భూతగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది POKకే చెందుతుందని కొందరు చెబుతుంటే జిల్లా యంత్రాంగం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. పాకిస్థాన్‌కు చెందిందన్న ఆధారాలు ఏమీ లేవని తేల్చి చెబుతోంది.
పీఓకేపై ఉత్తరాఖండ్ సీఎం...
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. మోదీ ప్రభుత్వం.. పాకిస్థాన్ నుంచి పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)ను వెనక్కి తీసుకోవాలన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వెనక్కి తీసుకోవడం మన కర్తవ్యమని ఆయన అన్నారు.
" పీఓకేను వెనక్కి తీసుకోవడం మన కర్తవ్యం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించాం. ఇది మోదీ ప్రభుత్వ అజెండాలో ఉండాలి. ప్రస్తుతం పాకిస్థాన్ బలహీనమైన స్థితిలో ఉంది. కనుక మనం దానిని వెనక్కి తీసుకునేందుకు ఇదే సరైన సమయం. "
- హరీశ్ రావత్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం
పాక్ ఆర్మీ చీఫ్ కామెంట్స్..
పాకిస్థాన్‌కు కొత్తగా నియమితులైన ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. ప్రతి ఇంచు భూమిని రక్షించుకోవడమే కాకుండా శత్రుదేశంపై దాడి చేస్తామని భారత్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి నియంత్రణ రేఖలోని (Line of Control) రాఖ్‌చిక్రీ సెక్టార్‌లో మునీర్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి సైనికులు, ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
" గిల్గిత్-బాల్టిస్థాన్‌తో పాటు జమ్ముకశ్మీర్‌పై భారత్ ఇటీవల బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేసింది. వాటిని మేము గమనించాం. మా మాతృభూమిలో ప్రతి అంగుళాన్ని రక్షించుకోవడమే కాకుండా.. శత్రువులు మాపై దాడిచేస్తే తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. "
-అసిమ్ మునీర్, పాకిస్థన్ ఆర్మీ చీఫ్
Also Read: Rapido Bike Taxi: ర్యాపిడోకి షాక్ ఇచ్చిన కోర్టు, సర్వీస్‌లు నిలిపివేయాలంటూ ఆదేశాలు