Microsoft Vacation Policy: సాధారణంగా, ఉద్యోగులకు క్యాజువల్‌ లీవ్స్‌ (CLs), సిక్‌ లీవ్స్‌ (SLs), ఎర్న్‌డ్‌ లీవ్స్‌ను (ELs) యాజమాన్యాలు అందుబాటులో (కార్మిక చట్టం ప్రకారం తప్పదు) ఉంచుతాయి. మరికొన్ని ప్రముఖ కంపెనీలు వెకేషన్‌ లీవ్స్‌ ‍‌(VLs) కూడా ఇస్తుంటాయి.


రోజూ ఆఫీసుకు వస్తుంటే, సమయం కుదరక కొన్ని వ్యక్తిగత పనులు ఆగిపోతుంటాయి. లేదా ఉద్యోగి మీద ఒత్తిడి పెరుగుతుంటుంది. వ్యక్తిగత పనులు పూర్తి చేసుకోవడానికో, ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమో ఉద్యోగులు క్యాజువల్స్‌ లీవ్స్‌ను వాడుకుంటారు. అనారోగ్యం బారిన పడినప్పుడు సిక్‌ లీవ్స్‌ను వినియోగించుకుంటారు. ఏదైనా విహార యాత్రకు వెళ్లాలనుకున్నప్పుడు వెకేషన్ లీవ్స్‌ ఖర్చు చేస్తారు.


అయితే, కంపెనీలు ఆఫర్‌ చేసే వెకేషన్‌ లీవ్స్‌కు కొంత పరిమితి ఉంటుంది. ఒక ఉద్యోగి, విహార యాత్ర కోసం తనకు ఇష్టం వచ్చినన్ని రోజులు సెలవు పెడతానంటే కుదరదు. వెకేషన్‌ లీవ్స్‌ అయిపోయాక, నిబంధనల ప్రకారం వేరే సెలవులను వాడుకోవడమో, జీతం నష్టాన్ని భరించడమో చేయాలి.


నక్క తోక తొక్కిన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు
కానీ, గ్లోబల్‌ టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో (Microsoft) మాత్రం, ఎన్ని కావాలంటే అన్ని వెకేషన్‌ లీవ్స్‌ వాడుకోవచ్చు. వెకేషన్‌ లీవ్స్‌ విషయంలో గతంలో ఉన్న పరిమితిని ఎత్తి వేస్తూ ఈ టెక్‌ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది.


ప్రస్తుతం అమలు చేస్తున్న నాలుగు వారాల వెకేషన్‌ పాలసీని (microsoft vacation policy) మైక్రోసాఫ్ట్‌ రద్దు చేస్తోంది. దానికి బదులు డిస్క్రెషనరీ టైమ్‌ ఆఫ్‌ (Discretionary Time Off Policy- DTO) పేరుతో కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. మరో మూడు రోజుల్లో, అంటే 2023 జనవరి 16వ తేదీ నుంచి డిస్క్రెషనరీ టైమ్‌ ఆఫ్‌ పాలసీ అమల్లోకి వస్తుంది. 


అమెరికాలో పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు మాత్రమే ఈ కొత్త పాలసీ వర్తిస్తుందని, మైక్రోసాఫ్ట్‌ మానవ వనరుల విభాగం (Microsoft's chief people officer) అధికారిణి కేథ్లీన్‌ హోగన్‌ తమ ఉద్యోగులకు ఈ-మెయిల్‌ ద్వారా తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.


"ఇప్పుడు కాలం మారింది. పలానా నిర్దిష్ట ప్రాంతం నుంచే, పలానా పని గంటల్లోనే ఉద్యోగులు పని చేయాలన్న నిబంధనలు ఇప్పుడు లేవు. డిస్క్రెషనరీ టైమ్‌ ఆఫ్‌తో ఉద్యోగులు తమకు నచ్చిన సమయంలో, నచ్చిన చోటు నుంచి పని చేసే వీలు ఉంటుంది. ఈ సెలవుల్లో ఉన్న ఉద్యోగులకు జీతం నష్ట భయం ఉండదు. డీటీవోలో ఉన్న సిబ్బంది వేతనంతో కూడిన సెలవులు పొందుతారు’’ అని తన ఈ-మెయిల్‌లో కేథ్లీన్‌ హోగన్‌ వివరించినట్లు ఇంటర్నేషనల్‌ మీడియా రిపోర్ట్ చేసింది. 


మైక్రోసాఫ్ట్ అమెరికన్ సిబ్బందికి బంపర్ ఆఫర్‌ అప్పుడే అయిపోలేదు. వాళ్లకు ఏడాదికి 10 కార్పొరేట్‌ సెలవులు, అబ్సెన్స్‌ లీవులు, సిక్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌ టైమ్‌ ఆఫ్‌ (sick and mental health time off) పేరుతో ప్రత్యేక సెలవులను కంపెనీ ఇస్తోంది. 


ఒకవేళ ఏ ఉద్యోగి అయినా DTO సెలవులను వాడుకోకపోతే, ఆ సెలవులకు బదులుగా ఏటా ఏప్రిల్‌లో వన్ టైమ్‌ పే-ఔట్ (one-time payout) పేరుతో నగదు చెల్లింపు చేస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.


అపరిమిత సెలవు దినాలను అందిస్తున్న మొదటి టెక్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్ మాత్రం కాదు. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉన్న సేల్స్‌ఫోర్స్, ఒరాకిల్, నెట్‌ఫ్లిక్స్, లింక్డ్‌ఇన్ గతంలోనే ఈ ఫెసిలిటీని తమ ఉద్యోగులకు అందుబాటులోకి  తెచ్చాయి.