Pahalgam Baisaran Valley: కశ్మీర్ అంటేనే భూతల స్వర్గంగా పేరు. అక్కడి స్వర్గాన్ని టెర్రరిస్టులు నరకం చేశారు. ఇటీవలి కాలంలో పరిస్థితులు మెరుగుపడటంతో పర్యాటకులు పెరుగుతున్నారు. కశ్మీర్‌కు వెళ్లే వారు ఎక్కువ మంది పెహల్గాంకు వెళతారు. ఎందుకంటే.. ఆ ప్రాంతాన్ని  కశ్మీర్ స్విస్‌గా పిలుస్తారు. 



పహల్గామ్ ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో లిద్దర్ నది ఒడ్డున ఉంది. లిద్దర్ నది స్ఫటికంతటి స్వచ్చమైన నది. ఇక్కడ రాఫ్టింగ్ ,  ఫిషింగ్ వంటివి పర్యాటకుల్ని విశేషంగ ఆకట్టుకుంటాయి. అక్కడ  బీటాబ్ లోయ మరో ఆకర్షణ.  ఈ లోయ బాలీవుడ్ చిత్రం "బీటాబ్" షూటింగ్ కారణంగా అదే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆకుపచ్చ పచ్చిక బయళ్లు, దేవదారు చెట్లు ఉన్నాయి.



ఈ ప్రాంతంలో అరు లోయ ఉంటుంది.  లిద్దర్ నది శాఖలో ఒకటైన అరు నది ఒడ్డున ఉన్న ఈ లోయ, కొల్హోయ్ గ్లాసియర్, తర్సార్ లేక్‌లకు ట్రెక్కింగ్ కోసం బేస్ క్యాంప్‌గా ఉపయోగపడుతుంది. చందనవారి అనే ప్రాంతం అమర్‌నాథ్ యాత్రకు ప్రారంభ స్థానం, ఇక్కడ స్నో బోర్డింగ్, స్లెడ్జింగ్ వంటి కార్యకలాపాలు ఇక్కడ ఉంటాయి.  కొల్హోయ్ గ్లాసియర్‌ అరు లోయ నుండి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు, ఇక్కడ నుంచి హిమాలయ పర్వతాల అద్భుత దృశ్యాలను  చూడవచ్చు.  ఇక్కడే మార్తాండ్ సూర్య ఆలయం ఉంది.  8వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది.



బైసరన్ లోయను "మినీ స్విట్జర్లాండ్" అని పిలుస్తారు. ఇది పహల్గామ్‌కు 5 కి.మీ దూరంలో ఉంది.  సముద్ర మట్టానికి సుమారు 2,400-2,700 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఒక హిల్‌టాప్ మీడో. దట్టమైన పైన్ అడవులు, మంచుతో నిండిన పర్వతాలతో ఉటుంది.  బైసరన్ లోయ దాని సుందరమైన ఆకుపచ్చ పచ్చిక బయళ్లు, దట్టమైన పైన్ ఫారెస్ట్ చూస్తే అచ్చంగా  స్విట్జర్లాండ్ లాగే అనిపిస్తుది. అందుకే  "మినీ స్విట్జర్లాండ్" అని పిలుస్తున్నారు. 



బైసరన్‌కు రోడ్డు కనెక్టివిటీ లేదు. సాధారణంగా పహల్గామ్ నుండి గుర్రం ద్వారా చేరుకోవచ్చు. ఇందు కోసం 30-40 నిమిషాలు పడుతుంది.  ఫిట్‌నెస్ ఉన్నవారు సుమారు గంటన్నరలో  ట్రెక్కింగ్ ద్వారా కూడా చేరుకోవచ్చు బైసరన్ లోయ నుండి పహల్గామ్ టౌన్,  లిద్దర్ లోయ   అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. మార్గంలో కనిమార్గ్, డాబియన్, కాశ్మీర్ వ్యాలీ పాయింట్, పహల్గామ్ ఓల్డ్ విలేజ్ వంటి ఆకర్షణలు ఉన్నాయి.