Ayodhya Ram Mandir Opening:


శ్రీరామ జ్యోతి..


వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ వేడుకని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటించారు. అక్కడ అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్‌తో పాటు కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 22న జరిగే కార్యక్రమానికి అందరూ హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. అందుకే...దేశ ప్రజలంతా తమ ఇళ్లలోనే దీపాలు వెలిగించి (Shri Ram Jyoti) భక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోజు మరోసారి దీపావళి జరుపుకోపాలని అన్నారు. ఆ రోజు అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముందని..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే...ఈ వేడుక ముగిసిన తరవాత కాస్త రద్దీ తగ్గుతుందని అప్పుడు అందరూ వచ్చి రాముడి దర్శనం చేసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించి రాముడికి నీరాజనం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అంతే కాదు మకర సంక్రాంతి రోజున దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను శుభ్రం చేసుకోవాలని కోరారు. దీనిపైనే విమర్శలు వస్తున్నాయి. రామ మందిర నిర్మాణాన్ని ఇప్పటికే బీజేపీ రాజకీయం చేస్తోందని మండి పడుతున్న ప్రతిపక్షాలు. దీనికి తోడు దీపావళి చేసుకోవాలని మోదీ చెప్పడంపై మరింత అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌ ప్రతినిధి X వేదికగా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఓ వైపు దేశంలో చాలా మంది పౌరులు ఆకలితో అలమటిస్తుంటే ఇలాంటివి అవసరమా అంటూ ఫైర్ అవుతున్నారు. 


"భారత్‌లో 97 కోట్ల మంది ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం దొరకడం లేదు. లక్షలాది మందికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కోట్లాది మంది మురికి వాడల్లోనే ఉంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా అఛ్చేదిన్ పేరుతో సెల్ఫీ బూత్‌లు పెడుతున్నారు"


- తృణమూల్ కాంగ్రెస్ నేత 


రాముడి పేరుతో రాజకీయాలు: అధిర్ రంజన్ 


హైస్పీడ్ రైళ్లను తీసుకొచ్చినంత మాత్రాన సరిపోదని, ప్రయాణికుల భద్రతపైనా దృష్టి పెట్టాలని మండి పడుతున్నాయి ప్రతిపక్షాలు. అయోధ్యలో ప్రధాని 6 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన నేపథ్యంలో ఈ విమర్శలు చేశాయి. ప్రతి మతానికీ గౌరవం ఇవ్వాలన్న ప్రాథమిక సూత్రాన్ని బీజేపీ మరిచిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ మతాన్ని, రాజకీయాన్ని కలుపుతున్నారని అన్నారు. రాముడి పేరుతో రాజకీయ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 


అయోధ్యలో పలు కీలక ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ తరవాత ఓ సభలో పాల్గొన్నారు. అయోధ్య ప్రజలు తనకు ఘన స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వందల సంవత్సరాల కల జనవరిలో నెరవేరబోతుందని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. కోట్లాది మంది ప్రజలలాగే తానూ శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. జనవరి 22న జరిగే ఆ మహత్తర  ఘట్టం కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోందని అన్నారు. ఆధునిక అయోధ్యకు అంకురార్పణ జరిగిందని స్పష్టం చేశారు. 


Also Read: Mann Ki Baat: అయోధ్య రాముడి కోసం భజనలు చేయండి, భక్తిని చాటుకోండి - మన్‌కీ బాత్‌లో ప్రధాని