TSRTC Suspends Family 24 And T6 Tickets: తెలంగాణలో (Telangana) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ నెలకొన్న నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ (TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పరిధిలో జారీ చేసే ఫ్యామిలీ - 24, టి - 6 టికెట్ల జారీని ఉపసంహరించుకుంది. ఈ మేరకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (Sajjanar) ట్వీట్ చేశారు. జనవరి 1 నుంచి ఈ టికెట్ల జారీనీ పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. 'ఫ్యామిలీ 24. టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికులు గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. వారి వయసు తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే, మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో రద్దీ పెరగడంతో ఈ టికెట్ల జారీకి చాలా సమయం పడుతోంది. దీంతో ప్రయాణికుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఈ టికెట్ల జారీని నిలిపేయాలని సంస్థ నిర్ణయించింది. జనవరి 1(సోమవారం), 2024 నుంచి ఈ టికెట్లను ఇక జారీ చేయరు.' అంటూ సజ్జనార్ తెలిపారు.
అసలేంటీ ఫ్యామిలీ 24, టి 6 టికెట్స్
వీకెండ్స్ లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జంట నగరాల్లో (హైదరాబాద్ - సికింద్రాబాద్) ప్రయాణించే వారికి వెసులుబాటు కల్పించేలా ఫ్యామిలీ - 24 టికెట్ ను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. కుటుంబంలోని నలుగురు 24 గంటల పాటు సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడినైనా ఈ టికెట్ ద్వారా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం సిటీ బస్సుల్లో డే పాస్ తీసుకోవాలంటే ఒక్కరికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ఫ్యామిలీ - 24 టికెట్ ద్వారా నలుగురికి కలిపి రూ.300 చెల్లిస్తే సరిపోతుంది. ఫ్యామిలీలోని నలుగురు కలిసి ప్రయాణిస్తే రూ. 100 ఆదా చేసుకోవచ్చు. ఈ టికెట్ బస్ కండకర్లే జారీ చేసేలా అప్పట్లో సంస్థ ఉత్తర్వులిచ్చింది. ఇక, టి 6 టికెట్ల విషయానికొస్తే, ఈ టికెట్ ద్వారా మహిళలు, సీనియర్ సిటిజన్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నగరంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా కేవలం రూ.50కే ప్రయాణించవచ్చు. ఈ టికెట్ సబ్ అర్బన్ పరిమితుల్లోని అన్ని నాన్ ఏసీ బస్సుల్లో చెల్లుబాటవుతుంది. కాగా, మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ నేపథ్యంలో ఈ టికెట్ల జారీకి సమయం పడుతుండడంతో ప్రయాణీకుల సౌలభ్యం దృష్ట్యా వీటి జారీని పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.
కొత్త బస్సులు ప్రారంభం
హైదరాబాద్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద 80 కొత్త ఆర్టీసీ బస్సులను శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. ఇందులో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ అండ్ సీటర్ బస్సులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar), అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారని మంత్రి తెలిపారు. సీసీఎస్ బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఆర్టీసీ నష్టాలు తీరుస్తామని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇంకా అదనపు సర్వీసులు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాధునిక హంగులతో బస్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు.
Also Read: New Year 2024: నేడు ఈ రోడ్లు బంద్, 8 నుంచే డ్రంకెన్ డ్రైవ్ స్టార్ట్ - ‘సలార్’ డైలాగ్‌తో ప్రమోషన్