Delhi Airport Terminal Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టర్మినల్ 1 కుప్ప కూలిన ఘటన రాజకీయంగానూ దుమారం రేపుతోంది. మోదీ సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకునే ప్రాజెక్ట్‌లన్నీ ఇలాగే కూలిపోతున్నాయంటూ కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. మిగతా ప్రతిపక్షాలూ ఇదే విధంగా సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు పెడుతున్నాయి. బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ల పరిస్థితి ఇదీ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌తో పాటు జబల్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో రూఫ్‌ కూలిపోయిన ఘటననూ ప్రస్తావించారు. దీంతో పాటు మరి కొన్ని ప్రాజెక్ట్‌ల గురించీ చెప్పారు. అటు ఆప్‌ కూడా అదే స్థాయిలో బీజేపీపై మండి పడుతోంది. అయోధ్య రామ మందిరంలో పైకప్పు నుంచి నీళ్లు లీక్‌ కావడం, ప్రగతి మైదాన్ టన్నెల్‌లో సమస్యలతో పాటు మోర్బి బ్రిడ్జ్ కూలిన ఘటననూ ప్రతిపక్షాలు  ప్రస్తావిస్తున్నాయి. ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లను మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్న తీరుని తప్పుబడుతున్నాయి. బీజేపీ ఎక్కడుందో అక్కడ భారీ అవినీతి ఉందంటూ విమర్శిస్తున్నాయి. 






అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా మోదీ సర్కార్‌పై తీవ్రంగా మండి పడింది. "లంచం తీసుకోము. ఇంకెవరినీ తీసుకోనివ్వము" అని గొప్ప మాటలు చెప్పిన బీజేపీ పరిస్థితి ఇది అని విమర్శించింది. మంత్రులు లంచాలకు అలవాటు పడ్డారని ఆరోపించింది. ఈ అవినీతి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.






అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇదే స్థాయిలో విరుచుకుపడింది. మోదీ గ్యారెంటీ ఇదే అని సెటైర్లు వేసింది. ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తి కాకుండానే హడావుడిగా ప్రారంభిస్తున్నారని ఆరోపించింది. కేవలం ఎన్నికల కోసం ఇదంతా చేశారని విమర్శించింది. అయితే...ఈ ఘటనపై తప్పకుండా విచారణ జరిపిస్తామని మంత్రి కే రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.






Also Read: Delhi Rains: ఢిల్లీలో నీట మునిగిన ఎంపీ ఇల్లు, భుజాలపై కార్ వరకూ మోసిన సిబ్బంది - వీడియో వైరల్