Pensions Distribution In AP Key Update: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన పింఛన్లను జులై 1 నుంచి ఇంటి వద్దే అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చింది. అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలు కూడా వినియోగించుకోవాలని అధికారులకు సూచించింది. ఒక్కో ఉద్యోగి 50 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చూడాలన్నారు. ఈ మేరకు సీఎస్ నీరభకుమార్ జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలిచ్చారు. జులై 1వ తేదీనే (సోమవారం) లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్దేశించారు. ఒకవేళ ఎవరైనా మిగిలితే మంగళవారం పంపిణీ చేయాలని సూచించారు. డబ్బులను ఈ నెల 29నే బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు.
ఎరియర్లతో కలిపి రూ.7 వేలు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తొలి 5 సంతకాల్లో పింఛన్ల పెంపు ఒకటి. ఇటీవల కేబినెట్ భేటీలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీని ప్రకారం ఒకటో కేటగిరీలోని వృద్ధులు, వితంతువులు ఇతర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి పింఛన్ సొమ్ము రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. ఏప్రిల్ నుంచే దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన క్రమంలో.. ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి ఎరియర్లతో కలుపుకొని మొత్తం రూ.7 వేల పింఛన్ జులైలో అందజేయనున్నారు. రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుంచి రూ.15 వేలు, నాలుగో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన పింఛన్ సొమ్ము అందించనున్నారు.
వారికి అకౌంట్లలో జమ
పెరిగిన పింఛన్ల మేరకు 65,18,496 మందికి రూ.4,399.89 కోట్లు పంపిణీ చేయనున్నారు. వీరిలో 64.75 లక్షల మందికి ఇంటి వద్ద రూ.4,369.82 కోట్లు ఇంటి వద్ద అందిస్తారు. మిగిలిన 43 వేల మంది అంటే బయట చదువుకునే దివ్యాంగ్ విద్యార్థులకు రూ.30.05 కోట్లను డీబీటీ ద్వారా వారి అకౌంట్లలోకి జమ చేస్తారు. జులై 1 ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేశారు.