Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో చనిపోయిన వాళ్లకు సంబంధించిన వాళ్లం మేమే అంటూ నకిలీ కుటుంబ సభ్యులు వస్తున్నారు. నష్ట పరిహారం కొట్టేయడమే లక్ష్యంగా ఇలాంటి అరాచకాలకు తెగబడుతున్నారు. అయితే తాజాగా ఓ మహిళ ఓ వ్యక్తి మృతదేహం చూపిస్తూ.. అది తన భర్తదేనంటూ అబద్ధాలు చెప్పింది. అయితే ఆమె ప్రవర్తనతో అనుమానం కల్గిన పోలీసులు విచారించగా... అదంతా అబద్ధం అని తేలింది. ఈక్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతూనే అధికారులంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
ఆదివారం రోజు కటక్ కు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ.. బాలాసోర్ లోని తాత్కాలిక మార్చురీ రూమ్ వద్దకు వెళ్లింది. తన భర్త ఈ ప్రమాదంలోనే చనిపోయాడని చెబుతూ.. చాలా మృతదేహాలను చూపించమంది. అవన్నీ చూసి ఓ శవం వద్ద ఆగి తన భర్తదే అంటూ చెప్పింది. అయితే ఆమెను కాసేపు కూర్చొమని చెప్పగా... ఆమె ప్రశాంతంగా కూర్చుందట. ఆమె మొహంలో భర్త చనిపోయిన బాధ ఏమాత్రం లేకుండా, హాయిగా కూర్చుండడంతో అక్కడే ఉన్న ఒడిశా పోలీసు సబ్ -ఇన్‌స్పెక్టర్ బికాస్ కుమార్ పాలేకు అనుమానం వచ్చింది. దీంతో అతను ఆమెను విచారించగా.. ఈమె పేరుతో సహా కొన్ని విషయాలు చెప్పింది. దీంతో ఆ పోలీసలు వెంటనే బరాంబా పోలీసులను సంప్రదించారు. ఆమె ఏ అధికార పరిధిలో ఉందో తెలుసుకొని.. ఆమె భర్త బతికే ఉన్నట్లు తెలిపారు.
అయితే ఆమెకు ఆ విషయం ముందుగానే తెలిసినట్లు.. కావాలనే ఆమె నష్ట పరిహారం దక్కించుకుందామనే ప్లాన్ వేసి అక్కడకు వచ్చినట్లు గుర్తించారు. పోలీసు అధికారులంతా ఆమెను మందలించడంతో.. భయపడిపోయిన ఆమె పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. నష్ట పరిహారం కోసం మరికొంత మంది కూడా ఇలాంటి ప్లాన్ లు వేసే అవకాశం ఉందని.. కాబట్టి పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది?
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం కోరమండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో పాటు దానిలోని కొన్ని బోగీలు రెండో లైన్ గుండా వెళ్తున్న షాలిమార్ ఎక్స్ ప్రెస్ వెనుక బోగీలను ఢీకొన్నాయి.
ఎంత మంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారు?
ఈ రైలు ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య మొదట 288గా ఒడిశా ప్రభుత్వం తెలిపింది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. తదుపరి పరిశీలన, బాలాసోర్ జిల్లా మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదిక తర్వాత మరణాల సంఖ్యను 275గా మార్చారు.
క్షతగాత్రులు సోరో, బాలాసోర్, భద్రక్, కటక్‌లో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జెనా తెలిపారు. ఇప్పటివరకు 793 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, 382 మంది ప్రభుత్వ ఖర్చులతో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 88 మృతదేహాలను గుర్తించామని, 78 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని, ఇంకా 187 మందిని గుర్తించాల్సి ఉందన్నారు.