హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా పడినా రాజకీయ పార్టీలు మాత్రం తమ వ్యూహాలకు పదును పెడుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే హుజురాబాద్‌ను రౌండప్ చేసేశారు. బీజేపీ నేతలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇతర పార్టీలూ అదే పనిలో ఉన్నాయి. అయితే కొత్తగా తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్న పట్టదలతో ఉన్న వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మాత్రం పోటీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పోటీ చేయడం లేదన్న సంకేతాలను పంపారు. అయితే తాము పోటీ చేయకపోయినా నిరుద్యోగులతో పెద్ద ఎత్తున నామినేషన్లు వేయించాలని నిర్ణయించారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్‌లో పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. వారి ఎన్నికల పోరాటం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. అదే తరహాలో షర్మిల హుజురాబాద్‌లో కొత్త పోరాటం ప్రారంభించారు. 


Also Read : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే..?


ఇప్పటికే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న నిరుద్యోగులకు మద్దతుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికకు నిరుద్యోగుల‌తో భారీ ఎత్తున నామినేష‌న్లు వేయించాలని నిర్ణయించారు. ఇందు కోసం కోసం ప్రత్యేకంగా కో-ఆర్డినేట‌ర్‌ ను నియమింంచారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న భాస్కర్‌రెడ్డిని ష‌ర్మిల‌ నిరుద్యోగులతో నామినేషన్లు వేయించే కార్యక్రమానికి ఇంచార్జ్‌గా నియమించారు.  నిరుద్యోగులు భారీ ఎత్తున ఉపఎన్నిక బరిలో నిల‌వాలని షర్మిల ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న సీఎం కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలన్నారు. నిరుద్యోగుల‌కు మ‌ద్దతుగా వైఎస్‌ఆర్‌టీపీ అండ‌గా ఉంటుందని భరోసా ఇచ్చారు. నామినేష‌న్ల ప్రక్రియ, స‌హాయ స‌హ‌కారాలు నిరుద్యోగులకు అందిస్తామని హామీ ఇచ్చారు. 


Also Read : మహిళను చంపుతానని బెదిరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే


హుజురాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేయకపోయినా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్న ఉద్దేశంలో షర్మిల ఉన్నారు.  ఆ పోరాటానికి  నామినేషన్లు వేసే నిరుద్యోగులకు అండగా ఉండేలా ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసుకుంటున్నారు. ఉద్యోగ నోటిఫికేష‌న్ల విడుద‌ల జాప్యాన్ని నిర‌సిస్తూ హుజురాబాద్‌ వ్యాప్తంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వంపై గట్టిగా పోరాడటం ద్వారానే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని షర్మిల పట్టుదలగా ఉన్నారు. వైఎస్ పై ఉన్న అభిమానంతో పార్టీకి గట్టి పునాదులు ఉన్నాయని.. వాటిని ప్రజా పోరాటాల ద్వారా మరింత పటిష్టం  చేసుకోవాలని భావిస్తున్నారు. 


Also Read : కోమటిరెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలంటున్న నేతలు


ఉద్యోగ నియామకాల ప్రకటనను ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వెళ్తోంది. ఎప్పుడు ఉపఎన్నికలు జరిగినా యాభై వేల ఉద్యోగాల  భర్తీ అని చెబుతూంటారు. దుబ్బాక ఎన్నికలు ముగిసిపోయిప్పటి నుండి చెబుతున్నారు కానీ ఇంత వరకూ నోటిఫికేషన్లు రాలేదు. త్వరలో అనే ప్రకటన మాత్రం చేస్తున్నారు. నిరుద్యోగుల్లో ఉన్న ఈ ఆగ్రహాన్ని ప్రజాపోరాటాలుగా మార్చాలని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు పట్టుదలగా ఉన్నారు. 


Also Read : దళిత ఉద్యమంలోకి షర్మిల పార్టీ