తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ దళిత ఎజెండాను ఎంచుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత,  సీఎం కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో దళిత వాదం వినిపిస్తున్నారు. వారి కోసం దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టారు.  టీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా సభలతో ప్రజల ముందుకు వెళ్తోంది. తాజాగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తామంటున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా దళిత పోరాటాలు ప్రారంభించారు.  ప్రతి మంగళవారం ఉద్యోగ దీక్షలు చేస్తున్నట్లుగానే దళితుల కోసం కూడా పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు.  అందుకోసం " వైఎస్ఆర్ దళిత భేరీ " కార్యక్రమానికి రూపకల్పన చేశారు.


Also Read : షర్మిలను వైఎస్ ఆత్మీయులు ఒంటరి చేశారా..?


ముందుగా  సెప్టెంబ‌ర్ 12వ తేదీన‌ ఆదివారం రోజు సూర్య‌పేట జిల్లా, తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి మండ‌లకేంద్రంలో "వైఎస్ఆర్ ద‌ళిత భేరి" బ‌హిరంగ స‌భ  నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బహిరంగసభ పోస్టర్లను ఆ పార్టీ నేత ఏపూరి సోమన్న ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన దళితులకు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్ టీపీ భావిస్తోంది.  సీఎం కేసీఆర్ రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ద‌ళితుల‌ను వాడుకుంటున్నారని.. ఏడేళ్లుగా ఏ మేలు చేయని వారు ఇప్పుడు దళిత బంధు పేరుతో హడావుడి చేస్తున్నారని వైఎస్ఆర్ టీపీ పార్టీ విమర్శిస్తోంది.  కేసీఆర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ద‌ళితుల‌కు ఇస్తామ‌న్న‌ మూడెక‌రాల భూమి, ఎస్సీ కార్పొరేష‌న్ లోన్లు జాడ లేకుండా పోయాయని ఆ పార్టీ నేతలు విమర్శించారు.


 దేశంలోనే ద‌ళితుల‌ను నిట్ట‌నిలువునా ముంచింది ఎవ‌రైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్ర‌మేనని ఈ విషయాన్ని దళితులందరికీ తెలియచేస్తామని షర్మిల పార్టీ నేతలు చెబుతున్నారు.  గ‌తంలో ప్ర‌భుత్వం చెప్పిన విధంగా ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమికి డ‌బ్బులు క‌ట్టిచ్చి, ద‌ళిత‌బంధుతో క‌లిపి ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి రూ.50 ల‌క్ష‌లు చెల్లించాల‌ని వైఎస్ఆర్‌టీపీ డిమాండ్ చేసింది.   ద‌ళితుల చైత‌న్యం కోసం అనేక ఏళ్లుగా ప‌ని చేస్తున్న‌టువంటి గొప్ప నాయ‌కులు, మేధావులు, ప్రొఫెసర్లు, జ‌ర్న‌లిస్టులు దళిత భేరీ సభలో పాల్గొనే  అవకాశం ఉంది.


Also Read : హుజురాబాద్ టిక్కెట్ అడగనంటోన్న కొండా సురేఖ


తుంగతుర్తి సభ తర్వాత రిజర్వుడు నియోజకవర్గాలన్నింటిలోనూ సభలు పెట్టాలన్న ఆలోచనలో వైఎస్ఆర్‌టీపీ ఉంది. తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ దళితులను ఆకట్టుకోవడానికి పథకాలు.. పోరాటాలు చేస్తూండటంతో ఇక నుంచి దళిత వాదమే తెలంగాణలో వినిపించే అవకాశం కనిపిస్తోంది.