Nobel Prize 2022: 


ప్రముఖ శాస్త్రవేత్త స్వాంటే పాబో (Svante Paabo)కి ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఫిజియాలజీలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం లభించింది. అంతరించిపోయిన ఆదిమానవుల జీనోమ్స్‌, మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు వరించింది. శాస్త్రరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే నోబెల్‌ పురస్కార గ్రహీతకు...10 మిలియన్ల స్వీడిష్ క్రోన్స్ అందజేస్తారు. నియాండర్తల్‌ల జీనోమ్ సీక్వెన్స్‌పై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేశారు స్వాంతే పాబో. 


"ఈ విప్లవాత్మకమైన పరిశోధనతో...స్వాంటే పాబో సైన్స్‌కు కొత్త భాష్యం చెప్పారు. పాలియోజినామిక్స్‌కు కొత్త అర్థం ఇచ్చారు. అందుబాటులో ఉన్న పరిశోధనలు ఆధారంగా చేసుకుని...ఆయనతో పాటు ఆయన బృందం అంతరించిపోయిన మానవ జాతుల జీనోమ్ సీక్వెన్స్‌లను అనలైజ్ చేశారు. మానవ పరిణామ క్రమాన్ని సులువుగా సమర్థంగా అర్థం చేసుకోవడానికి ఈయన పరిశోధనలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగ పడతాయి." అని నోబెల్ అకాడమీ వెల్లడించింది. "ఈ పరిశోధనల్ని ప్రపంచానికి అందించినందుకు పాబోకి ధన్యవాదాలు. అంతరించినపోయిన మానవ జాతుల జీనోమ్స్...నేటితరం మానవుల ఫిజియాలజీపై ప్రభావం చూపుతోందని అర్థం చేసుకోగలిగాం" అని తెలిపింది.


వారం రోజుల పాటు రోజుకో రంగానికి సంబంధించిన ఓ వ్యక్తికి నోబెల్ పురస్కారం అందించనున్నారు. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య రంగాల్లో సేవలందించి వారికి వరుసగా అవార్డులు ఇస్తారు. శుక్రవారం అంటే...ఈ నెల 7వ తేదీన నోబెల్ శాంతిపురస్కారం ప్రకటిస్తారు. అక్టోబర్ 10న ఆర్థిక శాస్త్రంలో అత్యున్నత సేవలందించిన వారికి నోబెల్ అవార్డు ప్రకటిస్తారు.