వివాదాస్పద మత గురువైన నిత్యానంద స్వామి తాజాగా చేసిన ఓ ప్రకటన తమిళనాడులో సంచలనంగా మారింది. తమిళనాడులోని మధురై పీఠంపై ఆయన కన్నేశారు. మధురై అధీనం తదుపరి పీఠాధిపతిగా నిత్యానంద తనను తాను ప్రకటించుకున్నారు. మఠానికి సంబంధించిన సర్వ హక్కులు, అధికారాలు, ఆధ్యాత్మిక సంపద, మతపరమైన గౌరవాలు, పూజా కార్యక్రమాల నిర్వహణ తనకే చెందుతాయని నిత్యానంద తన లేఖలో పేర్కొన్నారు. ఆ అధీనం ప్రస్తుత పీఠాధిపతి అరుణగిరి నాథర్ అనారోగ్య సమస్యతో శుక్రవారం చెన్నైలో చనిపోయారు. అంతకుముందు అరుణగిరి నాథర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగానే నిత్యానంద ఆ ప్రకటన విడుదల చేశారు. అరుణగిరి నాథర్ వారసుడిగా నిత్యానంద స్వీయ ప్రకటన చేసుకోవడంతో మధురైలోని మీనాక్షి ఆలయం సమీపంలో ఉన్న మధురై అధీనం గదులను మూసివేశారు. గురువారం రాత్రి మైలాడుతురైకి చెందిన ధర్మపురం అధీనం సమక్షంలో గదులను సీల్ చేసేశారు.


వెయ్యేళ్ల చరిత్ర
మధురై అధీనం చాలా పురాతనమైనది. వెయ్యేళ్ల చరిత్ర గల ఈ మధురై అధీనం అత్యంత పురాతన శైవ (హిందూ) పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. ఈ పురాతన అధీనానికి త్రిమన్ నాయనార్ (శివుని శిష్యులు)లలో ఒకరైన తిరుజ్ఞాన సంబంధర్ పూర్వవైభవం తెచ్చారని చెబుతారు. పెద్ద ఎత్తున ఆస్తులు ఈ మఠం సొంతం. తంజావూరు జిల్లాలో వందల ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఎన్నో స్థిరాస్తులు ఈ మఠానికి సొంతంగా ఉన్నాయి. అంతేకాక, తమిళనాడులో నాలుగు ప్రముఖ దేవాలయాలకు ఈ మఠం ట్రస్టీగా కూడా ఉంది. ఇంతటి పురాతనమైన మఠానికి 292వ పీఠాధిపతిగా అరుణగిరి నాథర్ కొనసాగారు. ఆయన 1980ల నుంచి ఆ అధీనానికి సేవలందిస్తున్నారు. ఈ ఆగస్టు 9న అరుణగిరి నాథర్‌కు శ్వాససంబంధిత సమస్యలు తలెత్తడంతో మధురైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూ తాజాగా చనిపోయారు. ప్రస్తుతం ఆయన వయసు 77 ఏళ్లు.
Also Read: Jagitial: చనిపోయిన వ్యక్తిని బతికిస్తానన్న స్వామీజీ.. శవం దగ్గర మంత్రాలు, పూజలు.. చివరికి ఏమైందంటే..!


2012లోనే నిత్యానందను ప్రకటించిన పీఠాధిపతి
అయితే, నిత్యానంద ఇప్పుడు తనను తాను మధురై మఠం పీఠాధిపతిగా ప్రకటించుకునేందుకు ఓ కారణం ఉంది. ఆ మఠానికి నిత్యానందను యువ పీఠాధిపతిగా 2012లోనే అరుణగిరి నాథర్ ప్రకటించారు. అయితే, అదే సమయంలో కంచి, తిరువావదుతురై మఠాలు సహా.. ఇతర మఠాలకు చెందిన పీఠాధిపతులు అరుణగిరి నాథర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంపై పెద్ద దుమారమే రేగింది. దీంతో కొద్ది నెలలకే అరుణగిరి నాథర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. గతంలో అరుణగిరి నాథర్‌తో నిత్యానందకు సన్నిహిత సంబంధాలుండేవి. ఆధీనాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకొని మఠం ఆస్తులని, విలువైన మరకత లింగాన్ని అక్రమంగా తరలించినట్టు కొన్నేళ్ల క్రితం వీడియోలు బయట పడడంతో నిత్యానంద అధీనాన్ని వదిలి వెళ్లారు.


కోర్టుకెక్కిన నిత్యానంద
ఆ తర్వాత ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ.. నిత్యానంద కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇంకా మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అంతేకాక, మఠానికి సంబంధించిన వ్యవసాయ భూములు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి. వాటికి సంబంధించిన కేసులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అరుణగిరి నాథర్ ఐసీయూలో చావుబతుకుల మధ్య ఉండగానే.. నిత్యానంద మధురై అధీనం 293వ పీఠాధిపతిగా తనని తాను ప్రకటించుకున్నారు.
Also Read: India Corona Cases: కర్ణాటకలో లాక్‌డౌన్ విధిస్తారా.. క్లారిటీ ఇచ్చిన ఆర్థికశాఖ మంత్రి


అప్పట్లో సంచలనంగా లైంగిక వేధింపుల కేసు
2010లో నిత్యానందపై లైంగిక వేధింపుల కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన ఓ సినీ నటితో రాసలీలలు ఆడుతున్న వీడియో అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల వయసు గల నిత్యానంద పరమశివం అసలు పేరు రాజశేఖరన్. ఆయన 20 ఏళ్ల క్రితం బెంగళూరు-మైసూర్ హైవే పక్కన బిడాది అనే ప్రాంతంలో ఆశ్రమం నెలకొల్పారు.