Special Status For Bihar: బిహార్‌కి ప్రత్యేక హోదా కచ్చితంగా వస్తుందని భావించినా కేంద్రం ఆ స్టేటస్ ఇవ్వలేదు. దీనిపై అప్పుడే బిహార్ రాజకీయాల్లో రచ్చ మొదలైంది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేతలు జేడీయూపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్‌ని నెరవేర్చుకోవడంలో నితీశ్ ఫెయిల్ అయ్యారని మండి పడుతున్నారు. అయితే...ఈ బడ్జెట్‌లో మాత్రం కొంత వరకూ ప్యాకేజీ ఇచ్చి ఊరటనిచ్చింది. ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంతో పాటు ప్రత్యేకంగా ఆర్థిక తోడ్పాటుకు తాము ఎప్పటికీ సిద్ధంగా ఉంటామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కానీ స్పెషల్ స్టేటస్ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.


అంతకు ముందే జేడీయూ ఎంపీ పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా గురించి ప్రశ్న అడగ్గా అలాంటి ఆలోచనే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్‌ని మీడియా ప్రశ్నించింది. NDAలో మిత్రపక్షంగా ఉన్న జేడీయూ ఏం చేయబోతోందని అడగ్గా అందుకు నితీశ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. "అన్నీ మెల్లగా మీకే తెలుస్తాయ్" అని బదులిచ్చారు. ఈ సమాధానమే ఆసక్తి రేపుతోంది. వేచి చూడండి అని నితీశ్ అన్నారంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచనలా ఉందా..? కాస్త ఆలస్యంగానైనా ఈ డిమాండ్‌ని నెరవేర్చుతుందా..? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలోని ప్రభుత్వంలో JDU కీలక పాత్ర పోషిస్తోంది. 


ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతగా మెజార్టీ సాధించలేకపోయింది. JDU,TDP సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పదేపదే ఓ కూటమి నుంచి మరో కూటమిలోకి జంప్ అవడం నితీశ్ కుమార్‌కి ఉన్న అలవాటు. ఇప్పుడు తమ డిమాండ్‌లను నెరవేర్చకపోతే మళ్లీ NDAలో నుంచి ఆయన బయటకు వచ్చేస్తారా అన్న చర్చ మొదలైంది. 2022 ఆగస్టులో ఇదే జరిగింది. NDA నుంచి బయటకు వచ్చిన నితీశ్ మహాఘట్‌బంధన్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల ముందు మళ్లీ ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. NDA కూటమిలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత జేడీయూ జాతీయ స్థాయి సమావేశం జరిగింది. స్పెషల్ స్టేటస్ గురించి ఈ భేటీలో ఓ తీర్మానం కూడా పాస్ చేశారు. అప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ హోదాయే ఇవ్వమని కేంద్రం ప్రకటించడం వల్ల ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. 


నితీశ్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ విషయంలో సర్దుకుపోయారని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తేజస్వీ యాదవ్ విమర్శించారు. వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ డ్రామా పాలిటిక్స్ అంటూ ఫైర్ అయ్యారు. నిజానికి 2000 సంవత్సరం నుంచే నితీశ్ కుమార్ బిహార్‌కి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. మధ్యలో చాలా సందర్భాల్లో భారీ ర్యాలీలు చేశారు కూడా. ప్రస్తుతానికి దేశంలో అసోం, నాగాలాండ్, మిజోరం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. 


Also Read: Budget 2024 Updates: స్టాండర్ట్ డిడక్షన్ పరిమితి రూ.75 వేలకు పెంపు, కొత్త పన్ను విధానాన్ని ప్రకటించిన కేంద్రం