Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవికి తాను హక్కుదారుడ్ని కాదని నితీశ్ అన్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నితీశ్ కుమార్ నిలిచే అవకాశం ఉందని వార్తలు వస్తుండటంతో ఆయన ఈ మేరకు స్పందించారు.
వరుస భేటీలు
భాజపాతో సంబంధాలు తెంచుకున్న తర్వాత నితీశ్ కుమార్ పలువురు విపక్ష నేతలతో సమావేశమవుతున్నారు. దిల్లీలో రెండో రోజూ పర్యటించిన నితీశ్ కుమార్.. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. ఆ తర్వాత సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. తొలుత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సోమవారం కలిసిన నితీశ్ ఆ మరుసటి రోజే సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు.
ఏచూరీతో భేటీ తర్వాత నితీశ్ కుమార్ గురుగ్రామ్ పయనమయ్యారు. హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాతో నితీశ్ కుమార్ భేటీ అయ్యారు.
కేసీఆర్ భేటీ
నితీశ్ కుమార్, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ తదితరులను కేసీఆర్ ఇటీవలే పట్నాలో కలుసుకుని చర్చలు జరిపారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని కేసీఆర్ కోరుతున్నారు. ఇటీవలే భాజపాతో కటీఫ్ చెప్పి ఆర్‌జేడీతో జత కట్టి బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు.
త్వరలోనే ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్‌పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోనూ నితీశ్ చర్చలు జరపనున్నారు.
Also Read: Covid-19 Vaccine: భారత్ బయోటెక్ నాసల్ టీకాకు DCGI గ్రీన్ సిగ్నల్
Also Read: మరో ట్విస్ట్ ఇచ్చిన పుతిన్- కిమ్ సాయంతో ఉక్రెయిన్‌పై పోరు!