ప్రస్తుతం ప్రపంచంలో భారత స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యనే అత్యుత్తమ ఆల్ రౌండర్ అని.. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపినప్పటి నుంచి తన ఫామ్ ను అలాగే కొనసాగిస్తున్నాడని ప్రశంసించాడు. 


ది ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ ఈ ఆసీసీ దిగ్గజంపై విధంగా వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ప్రపంచ టీ20 ఆటగాళ్లలో మొదటి ఐదుగురు ఆటగాళ్లను పాంటింగ్ ప్రకటించాడు. అందులో భారత్ నుంచి ఇద్దరికి చోటు కల్పించాడు. పాండ్య ఇంకా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తన ఫేవరెట్ ఫైవ్ లో చేర్చాడు.


గాయం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత హార్దిక్ మునుపటిలా ఆడలేకపోయాడు. అయితే ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వం వహించి మొదటి సీజన్ లోనే కప్ ను అందించాడు. నాయకుడిగా, బ్యాటర్ గా, బౌలర్ గా అదరగొట్టాడు. అదే ఫాంను అంతర్జాతీయ క్రికెట్లోనూ కొనసాగిస్తున్నాడు. ఆసియా కప్ లోనూ పాక్ తో మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో విజయాన్ని అందించాడు. ఈ  క్రమంలోనే పాండ్యపై పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు.


కొంతకాలంగా హార్దిక్‌ను ఇబ్బందిపెట్టిన వెన్నుగాయానికి చికిత్స తర్వాత అతను మునుపటిలా బౌలింగ్ చేయలేడని తాను భావించినట్లు పాంటింగ్ తెలిపాడు. అయితే తిరిగి బౌలింగ్ చేయడమే కాక.. 140 కి.మీ.ల వేగంతో బంతులు సంధించడం టీమిండియాకు శుభపరిణామమని అన్నాడు. తన ఆటను పాండ్య ఇప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకుంటున్నాడని ప్రశంసించాడు. అలానే జట్టులోనూ తన పాత్రను అవగాహన చేసుకుని ఆడుతున్నాడని అభినందించాడు. తన దృష్టిలో ఇప్పుడు హార్దిక్ పాండ్య ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్ రౌండర్ అని పాంటింగ్ స్పష్టం చేశాడు. 


పాంటింగ్ టీ20 టాప్- 5 ఆటగాళ్లు


1. రషీద్ ఖాన్ (అఫ్ఘనిస్థాన్)


2. బాబర్ అజాం ( పాకిస్థాన్)


3. హార్దిక్ పాండ్య ( భారత్)


4. జోస్ బట్లర్ ( ఇంగ్లండ్)


5. జస్ప్రీత్ బుమ్రా (భారత్)