Nifty 50: గత వారం చివరలో రెండు రోజుల పతనం తర్వాత, సోమవారం నిఫ్టీ50 ఇండెక్స్‌ లాభాల్లో ముగిసింది. డైలీ చార్ట్‌లో బుల్లిష్ క్యాండిల్‌ను ఇది ఫామ్‌ చేసింది, బ్రాడర్‌ రేంజ్‌లో ఉంది. ఇండెక్స్‌కు 17,780-17,800 వద్దతక్షణ ప్రతిఘటన, 17,500 వద్ద తక్షణ మద్దతు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని 'బయ్‌ ఆన్‌ డిప్స్‌' మార్కెట్‌గా బ్రోకింగ్‌ హౌస్‌ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ చూస్తోంది. 17,800 స్థాయిని దాటి నిఫ్టీ నిలదొక్కుకోగలిగితే, అక్కడి నుంచి స్థిరమైన కొనుగోళ్లను చూడవచ్చని అంటోంది.


నిఫ్టీ వీక్లీ, మంత్లీ చార్ట్‌లు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి, ఇండెక్స్‌లో మరింత ర్యాలీ మిగిలి ఉందని తాము భావిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. కాబట్టే, ఏదైనా డౌన్‌వర్డ్ కరెక్షన్‌ను 'కొనుగోలు అవకాశం'గా భావించవచ్చని అంటోంది.


గోల్డెన్‌ క్రాస్‌
టెక్నికల్ చార్ట్‌ ప్రకారం.. గత రెండు నెలలుగా ఊపులో ఉన్న ఇండియన్‌ ఈక్విటీలు సృష్టించిన అప్‌వర్డ్‌ ట్రెండ్‌ కంటిన్యూ అయ్యే సూచనలు ఉన్నాయి. బెంచ్‌మార్క్ నిఫ్టీ50 రెండేళ్ళలో మొదటిసారిగా చార్ట్‌లో గోల్డెన్ క్రాస్‌ను ఫామ్‌ చేసింది. ఇండెక్స్ వాల్యూ షార్ట్‌ టర్మ్‌ మూవింగ్‌ యావరేజ్‌, లాంగ్‌ టర్మ్‌ మూవింగ్‌ యావరేజ్‌ కంటే పైన కదులుతున్నప్పుడు ఏర్పడే నమూనాను గోల్డెన్‌ క్రాస్‌ అంటారు.


ప్రస్తుతం, నిఫ్టీ50 100-డేస్‌ మూవింగ్‌ యావరేజ్‌ (DMA) కంటే, 50-డేస్‌ మూవింగ్‌ యావరేజ్‌ పై భాగంలో కొనసాగుతోంది. సోమవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత, 50 DMA 16,821 వద్ద ఉండగా, 100 DMA 16,628 వద్ద ఉంది. దీనినే గోల్డెన్‌ క్రాస్‌ అంటారు. ఇది ఇన్వెస్టర్లకు సిరులు కురిపిస్తుందని చరిత్ర చెబుతోంది.


2020 జులైలోనూ గోల్డెన్ క్రాస్ నమూనా కనిపించింది. అక్కడి నుంచి 15 నెలల్లో ఇండెక్స్ దాదాపు రెండింతలు పెరిగింది. ఇప్పుడు కూడా ఇండెక్స్‌ డబుల్‌ అవుతుందన్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆకాశంలో విహరింపజేస్తున్నాయి.


డి-కప్లింగ్‌ 
గతంలో, అమెరికన్‌, యూరోపియన్‌ మార్కెట్లు ఎటు మొగ్గితే మన మార్కెట్లు కూడా అలాగే డాన్స్‌ చేసేవి. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధం లేకుండా మన మార్కెట్లు మూవ్‌ అవుతున్నాయి. అంటే, డీ కప్లింగ్‌ అయ్యాయి. గత రెండు నెలలుగా అమెరికన్‌ మార్కెట్లలో సెల్లింగ్‌ ఉన్నా, మన మార్కెట్లు స్థిరంగా నిలబడ్డాయి. మన సూచీల్లో బలానికి ఇదొక సూచన.


నిఫ్టీ50 ఇండెక్స్ గత రెండు నెలల్లో దాదాపు 12% లాభపడింది. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లన్నింటి కంటే అత్యుత్తమ రాబడులను రాబట్టింది. ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) తిరిగి కొనుగోళ్లు ప్రారంభించడంతో ఇది సాధ్యమైంది. సెప్టెంబర్ త్రైమాసికం ప్రారంభం నుంచి, ఎఫ్‌పీఐలు ఇండియన్‌ ఈక్విటీల్లో దాదాపు 7.5 బిలియన్ డాలర్లు (రూ.59,000 కోట్లు) పెట్టుబడి పెట్టారు.


200 DMA కంటే పైన 70% నిఫ్టీ స్టాక్స్‌
సాంకేతిక సూచికల్లో 200 DMA అత్యంత కీలకం. గత 200 రోజుల ధరల సగటును ఇది సూచిస్తుంది. ఈ సగటు కంటే పైన ప్రస్తుత స్టాక్‌ ధర ఉంటే, దానిని బుల్లిష్‌గా చూస్తారు. అంటే, అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని అర్ధం. 200 DMA కంటే ప్రస్తుత స్టాక్‌ ధర తగ్గితే బేరిష్‌గా చూస్తారు. అంటే, ఆ షేర ధర ఇంకా పడిపోతుందని భావిస్తారు. ప్రస్తుతం, నిఫ్టీలో, 200 DMA కంటే పైన ట్రేడ్‌ అవుతున్న స్క్రిప్‌ల సంఖ్య కూడా ఇండెక్స్‌ రన్‌కు అనుకూలంగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం... నిఫ్టీ50 ప్యాక్‌లోని 70% పైగా షేర్ల ధరలు 200 DMA కంటే పైన ట్రేడవుతున్నాయి. ఈ నంబర్‌, అన్ని మేజర్‌ మార్కెట్ల కంటే అత్యధికం.


ప్రస్తుత నిఫ్టీ50 స్థాయి 200-DMA కంటే దాదాపు 4% పైన ఉంది, బుల్లిష్‌ సిగ్నల్‌ ఇస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.