CBI Former JD Laxminarayana: విలువైన వస్తువులు, ఫోన్ లు, నగలు, డబ్బులు, వాహనాలు పోతే పోలీసులకు ఫిర్యాదు చేయడం తరచుగా చూస్తూనే ఉంటాం. అలాగే గొడవలు, అల్లర్లు, మనుషులు మిస్సింగ్ అయినా వెంటనే పీఎస్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. రంగంలోకి దిగి మన సమస్యలు తీర్చేస్తుంటారు. కానీ మా పొలంలో ఫ్లెక్సి మిస్ అయిందంటూ వెళ్లి కంప్టైంట్ చేస్తే మాత్రం వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. అదే జరిగింది కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో. మామూలుగా అయితే పోలీసులు ఎలా స్పందిస్తారో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరైనా ఊహించగలరు. కానీ ఇక్కడ మాత్రం పోలీసులు ఫిర్యాదు తీసుకోవడమే కాదు. కేసు నమోదు చేశారు. ఆగమేఘాల మీద దర్యాప్తు ప్రారంభించారు. ఫ్లెక్సీ ఎక్కడ పోయింది.. ఎలా పోయింది.. ఎవరిపైన అయినా అనుమానం ఉందా.. చుట్టు పక్కల ఇలాంటి ఘటనలు జరిగాయా.. అని ఆరా తీయడం ప్రారంభించారు. అదేంటి ఫ్లెక్సీ పోవడం ఏంటి.. దానికి కంప్లైంట్ ఇవ్వడం ఏమిటి.. ఇచ్చిన కంప్లైంట్ పై ఇంతలా దర్యాప్తు చేయడానికి పెద్ద కారణం ఉంది. 


లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ పోయింది.. 
ఫిర్యాదు చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్- సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన వ్యక్తి, ఎన్నో అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఫైర్ ఉన్న అధికారి, కీలక కేసులను తనదైన శైలిలో పట్టుకున్న వ్యక్తి, జేడీ లక్ష్మీ నారాయణగా అందరికీ సుపరితులు. ఇండియన్ పోలీసు సర్వీసెస్ నుండి వాలంటరీ రిటైర్మెంట్ - వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత లక్ష్మీ నారాయణ వ్యవసాయంపై ఉన్న మక్కువతో సేంద్రీయ సాగు వైపు దృష్టి సారించారు. 


ఈనెల 1న ఘటన.. 
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం, రాచపల్లి గ్రామాల పరిధిలో దాదాపు 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. అందులో వరి నాట్లు వేశారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా సేంద్రీయ పద్ధతిలోనే పంటలు పండిస్తూ వస్తున్నారు లక్ష్మీ నారాయణ. తన పొలం వద్ద సేంద్రీయ వ్యవసాయం అని రాసి ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు ఈ మాజీ ఐపీఎస్ ఆఫీసర్. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా.. ఈ నెల 1వ తేదీ నుంచి పొలం వద్ద ఉండాల్సిన ఫ్లెక్సీ కనిపించడం లేదు. తన పొలం వద్ద సేంద్రీయ వ్యవసాయం అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కనిపించకుండా పోవడంపై లక్ష్మీ నారయణ ప్రత్తిపాడు పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 


ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు.. 
మాజీ ఐపీఎస్ అధికారి పొలంలో దొరబాబు అనే వ్యక్తి కాపలా ఉంటున్నాడు. ఫ్లెక్సీ పోయిన విషయంలో దొరబాబు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు.. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఫ్లెక్సీ పోయిన ఘటనపై దగ్గర్లోని సీసీటీవీ లో రికార్డు అయిన ఫుటేజీని పరిశీలిస్తామని ప్రత్తిపాడు సీఐ కిషోర్ బాబు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు హామీ ఇచ్చారు.