NIA Raids in Kashmir:
సోదాలు..
కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) జమ్ముకశ్మీర్‌ను జల్లెడ పడుతోంది. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తున్నారు. జమ్మూలోని కథువా జిల్లాలో సోదాలు కొనసాగుతున్నాయి. నార్కో టెర్రరిజం, టెర్రర్ ఫండింగ్‌కు సంబంధించిన రెయిడ్స్ చేపడుతున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా ఉగ్రవాదుల నుంచి నిధులు సేకరిస్తున్న వాళ్లపై నిఘా ఉంచారు. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారినీ పసిగట్టనున్నారు. చంఢీగఢ్‌లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జమ్ముకశ్మీర్‌లో 14 చోట్ల సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కుల్గం, పుల్వామా, అనంత్‌నాగ్, సొపోర్, జమ్ము జిల్లాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు చోట్ల కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పలు డిజిటల్ పరికరాలు, సిమ్ కార్డులు, డిజిటల్ స్టోరేజ్ డివైజ్‌లను సీజ్ చేశారు. జమ్ముకశ్మీర్ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు
కుట్ర జరుగుతోందని, దీని వెనక ఏ ఉగ్ర సంస్థ ఉందో కనిపెడతామని NIA అధికారులు స్పష్టం చేశారు. పాకిస్థానీ కమాండర్లకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. "సైబర్ స్పేస్ ద్వారా ఉగ్రదాడులకు పాల్పడాలని కుట్ర పన్నారు. భద్రతా బలగాల్లోని మైనార్టీలను కావాలనే లక్ష్యంగా చేసుకుని జమ్ముకశ్మీర్‌లో మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్ర పన్నారు" NIA వెల్లడించింది.
పండిట్‌లపై దాడులు..
జమ్ముకశ్మీర్ సోపియాన్ జిల్లాలో ఇటీవలే భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం ఉన్న ముగ్గురు స్థానిక ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇద్దరు ఉగ్రవాదులను లతీఫ్ లోన్, ఉమర్ నజీర్‌గా పోలీసులు గుర్తించారు. కశ్మీరీ పండిట్ శ్రీ పురాణ కృష్ణ భట్ హత్యలో లతీఫ్ ప్రమేయం ఉండగా, నేపాల్‌కు చెందిన టిల్ బహదూర్ థాపా హత్యలో అనంత్‌నాగ్‌కు చెందిన ఉమర్ నజీర్ ప్రమేయం ఉందని కశ్మీర్ ఏడీజీపీ తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన చోట నుంచి ఒక ఏకే-47 రైఫిల్, రెండు పిస్టల్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సోపియాన్ జిల్లాలోని ముంజ్ మార్గ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని అంతకుముందు కశ్మీర్ పోలీసులు తెలిపారు. కశ్మీర్‌లో పండిట్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు కొంత కాలం తగ్గుముఖం పట్టినట్టు అనిపించినా.. మళ్లీ ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది..ఈ తరహా ఘటనలు స్థానికులకు పాత రోజుల్ని గుర్తు చేస్తున్నాయి. సోపియన్ జిల్లాలో ఉగ్రవాదులు ఇటీవల పురాణ్ క్రిషన్ భట్ అనే పండిట్‌ను కాల్చిచంపారు. దక్షిణ కశ్మీర్‌లోని చౌదరి గుండ్ ప్రాంతంలో తన నివాసానికి సమీపంలో ఉండగానే...పురాణ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పటికప్పుడు సోపియన్ హాస్పిటల్‌కు తరలించినప్పటికీ..అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు బాధితుడు. పురాణ్ క్రిషన్ భట్‌కు ఇద్దరు పిల్లలున్నారు. "ఆయన బయటకు వెళ్లడానికి కూడా చాలా రోజులు భయపడిపోయాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఈ ఘటన మాకెంతో భయం కలిగిస్తోంది." అని మృతుడి బంధువు ఒకరు అన్నారు. గతంలో ఇదే సోపియన్ జిల్లాలో ఓ యాపిల్ తోటలో కశ్మీరీ పండిట్ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.