యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన కోలీవుడ్ మూవీ ‘లవ్ టుడే‘. తమిళ నాట ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాను తెలుగుతో పాటు పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఈ సినిమా తెలుగు రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. ఈ సినిమాకు చక్కటి ఓపెనింగ్స్ లభించాయి. రెండు వారాల పాటు మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. తెలుగులో ఈ సినిమా రూ. 5 కోట్లకు పైగా లాభాలు సాధించింది. మొత్తంగా మూడు వారాల పాటు ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శించబడింది.
నెట్ ఫ్లిక్స్ లో కొనసాగుతున్న స్ట్రీమింగ్
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. తొలుత అనుకున్న సమయాని కంటే ముందే అన్ని భాషల్లో ‘లవ్ టుడే’ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, కేవలం తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. డిసెంబర్ 23 నుంచి తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోంది. రాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ దక్కించుకున్నట్లుగానే, ఓటీటీలోనూ మంచి వ్యూస్ అందుకుంటోంది.
‘లవ్ టుడే’ స్టోరీ ఏంటంటే?
తమిళ నటుడు, దర్శకుడు అయిన ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’ చిత్రాన్ని తెరకెక్కించాడు. తనే ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఐటీ ఉద్యోగి అయిన ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నిఖిత (ఇవానా) లవ్ లో పడుతారు. వీరిద్దరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటారు. వీరి ప్రేమ వ్యవహారం హీరోయిన్ వాళ్ల ఇంట్లో తెలుస్తోంది. ఆమె ఫాదర్ శాస్త్రి (సత్యరాజ్) ప్రదీప్ తో మాట్లాడాలి అంటాడు. ఓసారి ఇంటికి తీసుకురమ్మని కూతురుకి చెప్తాడు. అబ్బాయితో మాట్లాడాక, ఓ కండీషన్ పెడతాడు. ఒక రోజంతా ఒకరి ఫోన్ మరొకరు మార్చుకోవాలని సూచిస్తాడు. అలా ఫోన్లు మారిన తర్వాత కూడా పెళ్లికి ఓకే అంటే తానే ఇద్దరిని ఒక్కటి చేస్తానని చెప్తాడు. ఇద్దరు ఫోన్లు మార్చుకున్నాక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఇద్దరు ఫోన్లలో మెసేజ్ లు చూసుకున్నాక ఎలా ఫీలయ్యారు? చివరకు వీరి పెళ్లి అయ్యిందా? లేదా? అనేది స్టోరీ.
‘లవ్ టుడే’ మూవీని అఘోరం, గణేష్, సురేష్ సంయుక్తంగా నిర్మించారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. సత్యరాజ్, యోగిబాబు, రాధిక శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Read Also: ఒక్కో కుటుంబంలో పది మంది హీరోలున్నారు - టాలీవుడ్‌పై అడవి శేష్ వివాదాస్పద వ్యాఖ్యలు