పవన్‌ కల్యాణ్‌ ఏ ముహూర్తాన రాజకీయ ముఖచిత్రం మారుతుందన్నాడో అప్పటి నుంచి తెలుగురాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం మారుతోంది. నిన్నటి వరకు పక్కచూపులు చూడని కెసిఆర్‌, చంద్రబాబు ఇప్పుడు అటు ఇటు ఫోకస్‌ చేస్తున్నారు. వద్దనుకున్న చోటే కావాలనుకుంటున్నారు. నిన్నటి వరకు ఒక్కచోటే పార్టీ.. ఒక్కచోటే అధికారం అని భావించిన టీఆర్‌ఎస్‌, టిడిపి ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లోనూ బలమైన పార్టీలుగా ఉండాలని నిర్ణయించాయి. 


ఎప్పుడైతే కెసిఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్‌ అయ్యారో అప్పుడే ఏపీపైనా దృష్టి పెట్టారు. త్వరలో  అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ముందు ఫోకస్‌ పెట్టిన కెసిఆర్‌ ఆ తర్వాత ఏపీలోనూ పాగా వేయనున్నారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆంధ్రకి చెందిన పలు వర్గాల నేతలు కెసిఆర్‌ని కలవడంతో ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రం మారడం మొదలైంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆంధ్రలో ప్రజాదరణ ఉండదేమో కానీ బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఉంటుందన్న గులాబీ శ్రేణులకు ఏపీ నుంచి సానుకూల వాతావరణం రావడం చర్చకు తావిస్తోంది. ఇంకోవైపు తెలంగాణలో దుకాణం బంద్‌ చేసిన టిడిపి ఉన్నట్టుండి మళ్లీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేయడంపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


కెసిఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీతో ఏపీ రాజకీయాలపై దృష్టిపెట్టడం వల్లే చంద్రబాబు తిరిగి తెలంగాణ టిడిపికి ఊపిరిపోశారని కొందరి వాదన. అంతేకాదు కెసిఆర్‌ని దెబ్బకొట్టేందుకు, బీజేపీతో స్నేహ హస్తం కలిపేందుకు బాబు పన్నిన వ్యూహంగా ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న టిడిపి నేతలను తిరిగి సొంతింటికి రమ్మని చంద్రబాబు పిలుపునివ్వడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీలో అడుగు పెట్టడం వెనక జగన్‌ ప్లాన్‌ ఉందన్న టాక్‌ కూడా ఉంది. టిడిపి-జనసేనని ధీటుగా ఎదుర్కోవాలంటే జగన్‌కి మద్దతునిచ్చే పార్టీ ఉండాలి. కానీ ఏపీలో విపక్షాలన్నీ ఒక్కటవ్వడంతో జగన్‌ మరోసారి ఒంటరి పోరుకి సిద్ధమవ్వాల్సి వస్తోంది. 


175 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత గతంలో వచ్చిన సీట్లు కూడా అటు ఇటుగా అందుకునే ఛాన్స్‌ ఉందని వైసీపీ నేతలు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్‌ పాలన కన్నా వైసీపీ నేతల తీరుపైనే ప్రజలు ఎక్కువగా అసహనంతో ఉన్నట్లు టాక్‌. ఈ నేపథ్యంలో ఓట్లు చీల్చేందుకు, విపక్షాల గెలుపు అవకాశాలు తగ్గించేందుకు ఏపీ సిఎం జగనే బీఆర్‌ఎస్‌ని రంగంలోకి దింపుతున్నారన్న గుసగుసలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే కెసిఆర్‌-జగన్‌ తెర వెనక రాజకీయాలు చేస్తున్నారని ఇరు రాష్ట్రాల విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కానీ గతంలో కెసిఆర్‌, చంద్రబాబుల తీరుతో ఇబ్బందిపడింది మాత్రం ప్రజలే. ఇప్పుడు మరోసారి వీరి మాటలను నమ్ముతారా ? ఇప్పుడు వ్యక్తులను చూసి ఓటేస్తున్నారే కానీ పార్టీలను కాదన్న విషయం గుర్తిస్తారా ?  అన్నదే ఆలోచించాల్సిన విషయం.


చంద్రబాబు రాక బీజేపీ పనే - తెలంగాణ మంత్రులు 
చంద్రబాబు తిరిగి తెలంగాణ యాక్టివ్ కావడానికి మోడి డైరెక్షన్ అని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. మోడి, అమిత్ షా సూచనల మేరకే చంద్రబాబు తెలంగాణలో పర్యటన చేస్తున్నారనీ, బీజేపీ టీడీపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా బతకదని మంత్రులు సెటైర్లు వేస్తున్నారు.