Prajwal Revanna Case Update: కర్ణాటక రాజకీయాల్లోని కుదిపేస్తున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న వ్యవహారం (Prajwal Revanna Case) మరో మలుపు తిరిగింది. తనపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ ఓ మహిళ వెల్లడించింది. ఇదే విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) తెలిపింది. ప్రజ్వల్‌పై కేసు పెట్టాలని కొందరు తనను వేధించారని, అందుకే ఫిర్యాదు చేశానని చెప్పినట్టు NCW వివరించింది. జాతీయ మహిళా కమిషన్‌కి అందిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ కేసు వెలుగులోకి రాగా..ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారన్న విషయం సంచలనమవుతోంది. ఇప్పటికే జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విచారణ జరుగుతున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) తప్పుడు కేసులను పరిగణనలోకి తీసుకుని అరెస్ట్ చేయడం దారుణమని మండి పడ్డారు. సిట్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధితులనూ బెదిరిస్తున్నారని విమర్శించారు.
"విచారణ అధికారులు బాధితుల ఇళ్లకి వెళ్లి బెదిరిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. అసలు విచారణ జరిగే తీరు ఇదేనా..? తమకు అనుకూలంగా కేసులు పెట్టిస్తున్నారు. ప్రపంచంలో ఇదే అతి పెద్ద కుంభకోణం అంటూ అనవసరంగా పెద్దగా చేసి చూపిస్తున్నారు. కిడ్నాప్ చేసిన ఆ మహిళను ఎక్కడ దాచి పెట్టారు..? కోర్టులో ఆమెని ఎందుకు ప్రవేశపెట్టడం లేదు"
- హెచ్‌డీ కుమారస్వామి
ఏంటీ వ్యవహారం..?
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడైన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయనతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్నపైనా ఇవే ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు తమ ఇంట్లో పని చేసిన మహిళను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు రావడం వల్ల పోలీసులు హెచ్‌డీ రేవణ్నని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రెండు కేసుల్లోనూ విచారణ జరుగుతోంది. ప్రజ్వల్ రేవణ్ని తాను వెనకేసుకు రావడం లేదని, తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాలని తేల్చి చెప్పారు కుమారస్వామి. అటు హోం మంత్రి జి పరమేశ్వర ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు చాలా నిక్కచ్చిగా పని చేస్తున్నారని, అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు. జేడీఎస్ చేస్తున్న అన్ని ఆరోపణలకీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
"మేం అందరికీ సమాధానం చెబుతూ కూర్చోలేం. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. విచారణలో అవకతవకలు జరుగుతున్నాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చేయనివ్వండి. ఇన్వెస్టిగేషన్ చాలా పక్కాగా జరుగుతోంది. వీడియోలు బయట పెట్టకుండా ఎవరైనా బెదిరించారని తెలిస్తే కచ్చితంగా ఆ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. జేడీఎస్ నేతలు చేసే ఆరోపణలపై మేం ప్రతిసారీ స్పందించలేం. విచారణ పూర్తైన తరవాత అన్ని వివరాలూ తెలుస్తాయి"
- జి పరమేశ్వర, కర్ణాటక హోం మంత్రి
Also Read: Fact Check: పుచ్చకాయల్లో కెమికల్స్ ఇంజెక్ట్ చేసి విక్రయిస్తున్నారా? ఈ వీడియో నిజమేనా?