New Parliament Building Construction:
నాగ్‌పూర్ నుంచి టేకు
పార్లమెంట్ అంటే దేశ సంస్కృతిని, చరిత్రను, ఉనికిని చాటి చెప్పే భవనం. ఇంతటి కీలకమైన భవంతి...హుందాగానే కాదు...అందంగానూ కనిపించాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. పార్లమెంట్‌ని అందంగా తీర్చి దిద్దేలా చొరవ చూపించింది. దాదాపు 60 వేల మంది కార్మికుల కృషితో ఇది రూపు దిద్దుకుంది. పార్లమెంట్ విషయంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇంటీరియర్ గురించే. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసింది కేంద్రం. ఇందులో ప్రతి నిర్మాణమూ గ్రాండ్‌గా కనిపించింది. సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా ఇంటీరియర్‌ని డిజైన్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి టేకుని తెప్పించారు. మీర్జాపూర్ నుంచి కార్పెట్‌లు తీసుకొచ్చారు. ఫ్లోరింగ్ కోసం త్రిపుర నుంచి కర్ర పట్టుకొచ్చారు. రాజస్థాన్ నుంచి రాళ్లు వచ్చాయి. ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి మెటీరియల్ తీసుకొచ్చి లోపల అందంగా తీర్చి దిద్దారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌కి ఇది ప్రతీక అని కేంద్రం చెబుతోంది.
ఎక్కడి నుంచి ఏమేం వచ్చాయి..?
ఎరుపు, తెలుపు శాండ్‌స్టోన్స్‌ని రాజస్థాన్‌లోని సర్మతుర నుంచి తెప్పించారు. అప్పట్లో ఢిల్లీలోని ఎర్రకోట నిర్మాణానికీ ఇక్కడి రాళ్లనే వాడారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి టేకుని తీసుకొచ్చారు. కేసరియా గ్రీన్ స్టోన్‌ని ఉదయ్‌పూర్ నుంచి తెప్పించారు. అజ్మేర్ నుంచి రెడ్ గ్రనైట్, రాజస్థాన్‌లోని అంబాజీ నుంచి మార్బుల్‌ను పట్టుకొచ్చారు. ఫర్నిచర్ అంతా ముంబయిలోనే తయారైంది. కేంద్ర పాలిత ప్రాంతమైన దమన్ అండ్ దియు నుంచి ఫాల్ సీలింగ్ స్టీల్ స్ట్రక్చర్‌ని తీసుకొచ్చారు. వీటినే రాజ్యసభ, లోక్‌సభ సీలింగ్ కోసం వినియోగించారు. అశోక చిహ్నాన్ని తయారు చేసేందుకు ఔరంగాబాద్, జైపూర్ నుంచి మెటీరియల్ తెప్పించారు. లోక్‌సభ, రాజ్యసభ గోడలపై కనిపించే అశోక చక్రాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారు చేశారు. అబూ రోడ్, ఉదయ్‌పూర్‌కి చెందిన శిల్పులు రాళ్లను చెక్కారు. హరియాణాలోని చర్ఖీ దర్దీ నుంచి మేనుఫ్యాక్చర్డ్ శాండ్ (M Sand) తెప్పించారు. కాంక్రీట్ మిక్స్‌లో ఇదే వినియోగించారు. హరియాణా,యూపీ నుంచి యాష్ బ్రిక్స్ తెప్పించి నిర్మించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పార్లమెంట్‌ని ప్రారంభించి జాతికి అంకితమిస్తారు. ఇదే క్రమంలో అత్యంత పవిత్రమైన సెంగోల్‌ని లోక్‌సభలో పొందు పరుస్తారు. బ్రిటీష్ నుంచి భారత్‌కు అధికార బదిలీకి చిహ్నంగా అప్పట్లో దీన్ని నెహ్రూకి బహూకరించారని చరిత్ర చెబుతోంది. కొత్త పార్లమెంట్‌లో సీటింగ్ కెపాసిటీ భారీగా పెరిగింది. లోక్‌సభలో 888 మంది కూర్చునేందుకు వీలుంటుంది. రాజ్యసభలో 300 మంది కూర్చోవచ్చు. దాదాపు 25 పార్టీలు ఈ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నాయి. అయితే...20 విపక్షాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని బైకాట్ చేశాయి.
న్యూ పార్లమెంట్ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. 1.48 నిమిషాల నిడివి గల వీడియోలో కొత్త పార్లమెంట్ భవనాన్ని చూపించారు. ప్రధాన ద్వారం నుండి లోపలకి ప్రవేశిస్తూ.. ప్రారంభం అవుతుంది ఈ ఫస్ట్ లుక్ వీడియో. పార్లమెంట్ భవనం లోపలి, బయటి దృశ్యాలను చిత్రీకరించారు. లోక్ సభ, రాజ్యసభ.. ఈ రెండు సభల్లో సభ్యుల సీటింగ్ అమరికను చూపించారు.