NITI Aayog Meeting: 



2047 లక్ష్యంగా..


దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ఆరోగ్యం, స్కిల్ డెవలెప్‌మెంట్‌, మహిళా సాధికారత, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించనున్నారు. 2047 నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ని సిద్దంచేయనున్నారు. నీతి అయోగ్ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌లు, కేంద్ర పాలిత ప్రాంతాల నేతలు, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి చీఫ్‌గా ప్రధాని వ్యవహరిస్తారు. Viksit Bharat @ 2047: Role of Team India పేరిట ఈ సమావేశం జరపనున్నట్టు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది భారత్. అయితే...దేశం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది మోదీ సర్కార్. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ రూపు రేఖలు ఎలా ఉండాలన్నది ఈ సమావేశంలో నిర్దేశించనున్నారు. వికసిత్ భారత్ 2047కి సంబంధించిన బ్లూ ప్రింట్‌ని తయారు చేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడనుంది. కేంద్రం ఇది కీలకమైన సమావేశం అని చెబుతున్నప్పటికీ..కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం హాజరు కాలేదు. మొత్తం 7గురు ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. 






వీళ్లంతా రాలేదు..


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్టు వెల్లడించారు. అటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం ఎలాంటి కారణం చెప్పలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ప్రధానికి లేఖ రాశారు. ఢిల్లీ పాలనా వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఖాతరు చేయడం లేదని మండి పడ్డారు. అందుకే..తాము ఈ సమావేశాన్ని బైకాట్ చేస్తున్నట్టు వెల్లడించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ కూడా హాజరు కావడం లేదని ప్రకటించారు. పంజాబ్ సమస్యల్ని కేంద్రం పట్టించుకోవడం లేదని, అందుకే బైకాట్ చేస్తున్నామని తేల్చి చెప్పారు. ఇది కేవలం ఫోటో సెషన్‌లాగే మారుతోందని, సమస్యలు పరిష్కారం అవడం లేదని ఆరోపించారు. ఇక బీజేపీతో కయ్యం పెట్టుకున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఆయనతో పాటు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీష్ కుమార్ కూడా రాలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల హాజరు కాలేదు.