New Parliament Carpets:


900 మంది కళాకారుల శ్రమ 


కొత్త పార్లమెంట్‌ నిర్మాణం కోసం వేలాది మంది కార్మికులు శ్రమించారు. ఇంటీరియర్‌ని అద్భుతంగా తీర్చి దిద్దారు. ఇందులో కార్పెట్‌లు హైలైట్‌గా నిలిచాయి. యూపీకి చెందిన కళాకారులు వీటిని అందంగా మలిచారు. చేతులతోనే వీటిని తయారు చేశారు. దాదాపు 900 మంది కళాకారులు పగలు రాత్రి కష్టపడ్డారు. లోక్‌సభ, రాజ్యసభలో వేసిన కార్పెట్‌లను తయారు చేసేందుకు 10 లక్షల గంటల పాటు చెమటోడ్చారు. జాతీయ పక్షి నెమలి రంగులోని కార్పెట్‌లను తయారు చేశారు. కమలం పువ్వు డిజైన్‌లనూ వాటికి అద్దారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న Obeetee Carpets సంస్థకు చెందిన కళాకారులు వీటిని అందజేశారు. లోక్‌సభ, రాజ్యసభల కోసం 300 కార్పెట్లు తయారు చేశారు. వీటిని రూపొందించే ముందు ఆర్కిటెక్చర్‌కి తగ్గట్టుగా కార్పెట్‌ని పరిచి కొలతలు చూసుకున్నారు. మొత్తం 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గట్టుగా కార్పెట్‌ని డిజైన్ చేశారు. 


"రాజ్యసభ, లోక్‌సభ హాల్స్‌కి సరిపోయే విధంగా వేరు వేరుగా 17,500 చదరపు అడుగుల మేర క్రాఫ్టింగ్ చేయాల్సి వచ్చింది. డిజైన్‌ టీమ్‌కి ఇది అతి పెద్ద సవాలు. ఎక్కడ అవసరమో అక్కడ కత్తిరించడం, వాటిని మళ్లీ వేరే చోట అతికించడం చాలా కష్టమైపోయింది. పైగా..ఎక్కడా కూడా చిన్న తేడా రాకుండా డిజైన్ చేయడం కోసం శ్రమించారు. ఎంత మంది వచ్చినా సరిపోయే విధంగా కార్పెట్‌లు వేయాల్సి వచ్చింది. రాజ్యసభకు కుంకుమ రంగులోని కార్పెట్‌లు తయారు చేశాం. లోక్‌సభలో మాత్రం నెమలి పింఛం రంగులో రూపొందించాం. స్క్వేర్ ఇంచ్‌కి కనీసం 120 అల్లికలతో చాలా జాగ్రత్తగా తయారు చేశారు. మొత్తంగా 60 కోట్ల అల్లికలు చేయాల్సి వచ్చింది. బదోయ్, మీర్జాపూర్‌ జిల్లాలకు చెందిన కళాకారులు 10 లక్షల గంటల పాటు శ్రమిస్తే కానీ ఈ కార్పెట్‌లకు తుదిరూపు రాలేదు"


- రుద్ర ఛటర్జీ, ఒబెట్టే కార్పెట్స్ కంపెనీ ఛైర్మన్ 


2020లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో వీళ్లంతా కార్పెట్‌ అల్లికల పనులు మొదలు పెట్టారు. ఆ తరవాత కొన్నాళ్లు ఆపేయాల్సి వచ్చింది. 2021 సెప్టెంబర్‌లో ప్రాజెక్ట్ మొదలైంది. 2022 మే నాటికి పని పూర్తైంది. అదే ఏడాది నవంబర్‌లో వీటిని ఇన్‌స్టాల్ చేశారు. ఎరుపు, తెలుపు శాండ్‌స్టోన్స్‌ని రాజస్థాన్‌లోని సర్మతుర నుంచి తెప్పించారు. అప్పట్లో ఢిల్లీలోని ఎర్రకోట నిర్మాణానికీ ఇక్కడి రాళ్లనే వాడారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి టేకుని తీసుకొచ్చారు. కేసరియా గ్రీన్ స్టోన్‌ని ఉదయ్‌పూర్‌ నుంచి తెప్పించారు. అజ్మేర్‌ నుంచి రెడ్ గ్రనైట్, రాజస్థాన్‌లోని అంబాజీ నుంచి మార్బుల్‌ను పట్టుకొచ్చారు. ఫర్నిచర్ అంతా ముంబయిలోనే తయారైంది. కేంద్ర పాలిత ప్రాంతమైన దమన్ అండ్ దియు నుంచి ఫాల్‌ సీలింగ్ స్టీల్ స్ట్రక్చర్‌ని తీసుకొచ్చారు. వీటినే రాజ్యసభ, లోక్‌సభ సీలింగ్‌ కోసం వినియోగించారు. అశోక చిహ్నాన్ని తయారు చేసేందుకు ఔరంగాబాద్, జైపూర్‌ నుంచి మెటీరియల్ తెప్పించారు. లోక్‌సభ, రాజ్యసభ గోడలపై కనిపించే అశోక చక్రాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తయారు చేశారు. అబూ రోడ్, ఉదయ్‌పూర్‌కి చెందిన శిల్పులు రాళ్లను చెక్కారు. 


Also Read: New Rs 75 Coin: కొత్త పార్లమెంట్‌లో రూ.75 కాయిన్‌ని విడుదల చేసిన ప్రధాని