WTC Final 2023, Yashasvi Jaiswal: 


టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ యశస్వీ జైశ్వాల్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఎంపికయ్యాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ స్థానంలో బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. స్టాండ్‌బై ఓపెనర్‌గా అతడు లండన్‌ విమానం ఎక్కనున్నాడు.


ప్రస్తుతం రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడుతున్నాడు. ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్‌ మ్యాచులో తలపడనున్నాడు. జూన్‌ 3న అతడు పెళ్లి చేసుకుంటున్నాడు. వివాహ వేడుక, రిసెప్షన్‌ ఉండటంతో జూన్‌ 5 తర్వాతే టీమ్‌ఇండియాకు అందుబాటులో ఉంటాడు. అయితే ప్రిపరేషన్‌కు టైమ్‌ లేకపోవడంతో యూకే వీసా ఉన్న యశస్వీ జైశ్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. మరో రెండు రోజుల్లో అతడు లండన్‌ వెళ్తాడు.


ఐపీఎల్‌ 2023లో యశస్వీ జైశ్వాల్‌ అదరగొట్టాడు. వీరోచిత ఫామ్‌ కనబరిచాడు. 14 మ్యాచుల్లో 625 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీలు బాదేశాడు. పవర్‌ ప్లే అంటే తన పేరే గుర్తొచ్చేలా ఆడాడు. తొలి ఆరు ఓవర్లలో బ్లాస్టింగ్‌ ఓపెనింగ్‌ పాట్నర్‌షిప్స్‌ నెలకొల్పాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. 15 మ్యాచుల్లో 80.21 సగటుతో 9 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీలు బాదాడు. 1845 పరుగులు సాధించాడు.


Also Read: కాన్వే, రుతురాజ్‌కు షమీ అంటే దడే! మోహిత్ శర్మకు ధోనీ భయం!


ఇక 2022-23 రంజీ ట్రోఫీలో యశస్వీ 5 మ్యాచుల్లో 315 పరుగులు చేశాడు. 45 సగటు సాధించాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్‌ సెంచరీ అతడి ఖాతాలో ఉన్నాయి. ఆ తర్వాత ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియాకు ఆడాడు. మధ్యప్రదేశ్‌పై 213, 144 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు జరిగిన ఇరానీ ట్రోఫీ మ్యాచులో అతడు చేసి 357 పరుగులే అత్యుత్తమ గణాంకాలు.


టీమ్‌ఇండియా జూన్‌ 7 నుంచి 11 వరకు ఓవల్‌ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడనుంది. అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఐపీఎల్‌ వల్ల బీసీసీఐ ఆటగాళ్లను బ్యాచులు బ్యాచులుగా లండన్‌కు పంపిస్తోంది. భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడటం ఇది రెండోసారి. అరంగేట్రం ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చవిచూసింది.