Neuberg Diagnostics IPO: హెల్త్‌ కేర్‌ సెక్టార్‌ నుంచి, డయాగ్నోస్టిక్స్ సెగ్మెంట్‌లో మరో కంపెనీ భారీ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (IPO) కోసం రెడీ అవుతోంది. న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌గా మారే సన్నాహాల్లో ఉంది. IPO ద్వారా పబ్లిక్‌లోకి వచ్చి, ₹1,500 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది.


హెల్త్‌ కేర్‌ సెక్టార్‌లో అనుభవజ్ఞుడైన G.S.K వేలు నేతృత్వంలో ఈ డయాగ్నోస్టిక్స్ చైన్‌ పని చేస్తోంది. IPO నిర్వహణ కోసం కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, ICICI సెక్యూరిటీస్ లిమిటెడ్‌లను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లుగా అప్పాయింట్‌ చేసినట్లు కూడా తెలుస్తోంది.


దేశ, విదేశాల్లో వ్యాపారం
భారత్‌లో ఉన్న అతి పెద్ద పాథాలజీ ల్యాబ్స్‌లో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్‌ లిమిటెడ్‌ కూడా ఒకటి. దీనికి మన దేశంలో 150 పైగా ల్యాబొరేటరీలు, 2,000కు పైగా కలెక్షన్‌ సెంటర్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) కూడా ఈ కంపెనీ బిజినెస్‌ చేస్తోంది.


IPO ద్వారా వచ్చిన డబ్బుతో భారత్‌ సహా విదేశాల్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY23) చివరి నాటికి, లేదా, FY24 మొదటి త్రైమాసికంలో IPOకు రావాలన్న ప్రణాళికల్లో ఉన్నట్లు గతంలో G.S.K వేలు వెల్లడించారు. ఆ ప్లాన్‌ ప్రకారం పని జరుగుతోంది.


ఉక్రెయిన్‌ - రష్యా కొట్లాట, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వంటి చికాకులన్నీ ఇప్పుడు దాదాపుగా తగ్గాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగి, మార్కెట్ల మంచి ర్యాలీలో ఉన్నాయి. పరిస్థితులు కుదుట పడడంతో, ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు డజనుకు పైగా కంపెనీలు పబ్లిక్‌గా మారాయి. ఈ కాలంలో.. గ్లోబల్ హెల్త్‌కేర్ లిమిటెడ్ (ఇష్యూ సైజ్‌ ₹2,205 కోట్లు) ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్, ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ (వీటి ఇష్యూ సైజ్‌లు ₹1,100 - 1,600 కోట్ల మధ్య ఉన్నాయి) IPOలుగా ప్రజల వద్దకు వచ్చాయి. ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ, బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ వంటి ఇతర సంస్థలు తమ IPOలను కంప్లీట్‌ చేసి, షేర్లను పబ్లిక్‌లోకి తెచ్చాయి.


అయితే... డా.లాల్ పాత్‌ల్యాబ్స్ లిమిటెడ్, థైరోకేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ వంటి డయాగ్నస్టిక్ స్టాక్స్‌ ధరలు గత సంవత్సరం నుంచి ఒత్తిడిలో ఉన్నాయి. కొత్తగా మార్కెట్‌లోకి అడుగు పెట్టిన కంపెనీల నుంచి, ముఖ్యంగా హెల్దీయన్స్ (Healthians), టాటా 1mg వంటి ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి తీవ్రమైన పోటీ ఉంది. కొవిడ్ పరీక్షలు పూర్తిగా తగ్గిపోవడం వల్ల కూడా వీటి ఆదాయంపై ప్రభావం పడింది. అయితే, నాన్-కోవిడ్ ఆదాయం బాగా పెరుగుతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.