Nepal Plane Crash Report:


పూర్తి నివేదిక..


ఈ ఏడాది మొదట్లోనే దేశమంతా ఉలిక్కిపడే సంఘటన జరిగింది. నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 5గురు భారతీయులూ ఉన్నారు. అయితే...అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విచారణ మొదలు పెట్టిన అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై ఓ కమిటీని నియమించగా..అందులోని సభ్యులు ఓ రిపోర్ట్ తయారు చేశారు. ప్రమాదానికి గల కారణాలేంటో అందులో వివరించారు. ఆపరేట్ చేసే విషయంలో చిన్న తప్పిదం కారణంగా విమానం కుప్ప కూలిందని చెప్పారు. 


"Flight Data Recorderలోని సమాచారమంతా పరిశీలించాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ల్యాండింగ్‌కు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే అప్పటికే పైలట్ అలెర్ట్ చేశాడు. ఇంజిన్ నుంచి పవర్ రావడం లేదని రెండు సార్లు ATCకి చెప్పాడు. ప్రమాదం జరిగే సమయానికి వాతావరణం బాగానే ఉంది. మబ్బులు కూడా పెద్దగా లేవు. సేఫ్‌గా ల్యాండ్ అయ్యేందుకు అనుకూలత వాతావరణమే ఉంది.
సాధారణంగా ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కాక్‌పిట్‌లోని Flaps Lever (విమానం స్పీడ్‌ను కంట్రోల్ చేసే డివైస్) ఆపరేట్ చేస్తే సేఫ్‌గా ల్యాండ్ అవచ్చు. అయితే...ఓ పైలట్‌ పొరపాటున Condition Lever(ఇంజిన్‌కు ఫ్యూయెల్ సప్లైను కంట్రోల్ చేసే డివైజ్) ను ఆపరేట్ చేశారు. ఫలితంగా ఇంజిన్‌ ఉన్నట్టుండి ఆగిపోయింది. రెండు ఇంజిన్ల ప్రొపెల్లర్‌లు ఆగిపోయాయి. అందుకే ల్యాండింగ్ అయ్యేటప్పుడు కంట్రోల్ తప్పి కుప్ప కూలింది" 


- కమిటీ రిపోర్ట్ 


ఈ 72 మందిలో 68 మందిప్రయాణికులు కాగా..మిగతా నలుగురు విమాన సిబ్బంది. ఓల్డ్ ఎయిర్‌పోర్ట్, పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మధ్య ఫ్లైట్ క్రాష్ అయినట్టు Yeti Airlines వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 


ఆ రోజు జరిగిందేంటంటే..? 


1. ఉదయం 10.33 గంటలకు ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ బయల్దేరింది. 
2. పొఖారా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యే ముందు సేటి నది పక్కనే ఉన్న వాగులో కుప్ప కూలింది. టేకాఫ్ అయిన 20 నిముషాలకే ఈ ప్రమాదం సంభవించింది. సాధారణంగా ఖాట్మండు నుంచి పొఖారాకు రావడానికి 25 నిముషాలు పడుతుంది. సరిగ్గా పొఖారా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ముందు కుప్ప కూలింది. 
3. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయట పడతారని అధికారులు భావించడం లేదు. ప్రమాద తీవ్రత అలా ఉంది. 
4. క్రాష్ అయిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగినట్టు స్థానికులు వెల్లడించారు. 
5.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. 
6. గతేడాది మే 29న కూడా నేపాల్‌లో ఇలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. తారా ఎయిర్‌ ప్లేన్ కుప్ప కూలిన ఘటనలో 22 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: Twitter Offices India: ట్విటర్ ఆఫీస్‌లకు తాళం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన మస్క్