Everset Masala Banned: భారత్‌కి చెందిన మసాలా పౌడర్‌లలో హానికర రసాయనాలున్నాయంటూ సింగపూర్, హాంగ్‌కాంగ్ తీవ్ర ఆరోపణలు చేశాయి. వాటి వినియోగంపైనా నిషేధం విధించాయి. ఇప్పుడు నేపాల్ కూడా ఇదే ఆరోపణలు చేసింది. Everest,MDH కంపెనీలకు చెందిన మసాలాల్లో హానికర పురుగు మందులున్నాయని తేల్చి చెప్పింది. వీటి వాడొద్దంటూ నిషేధించింది. నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ వీటిని టెస్ట్ చేయగా అందులో ఇథిలీన్ ఆక్స్సైడ్‌ (ethylene oxide) అవశేషాలు కనిపించాయని వెల్లడించింది. ఈ కెమికల్స్ కారణంగా క్యాన్సర్‌ వస్తుందని హెచ్చరించింది. ఇకపై భారత్ నుంచి వీటిని దిగుమతి చేసుకోమని నేపాల్ ప్రకటించింది. అధికారిక ప్రకటన చేసేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. 


"ఎవరెస్ట్, MDH బ్రాండ్స్‌కి చెందిన మసాలా పౌడర్‌ల దిగుమతిపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నాం. మార్కెట్‌లోనూ వీటి విక్రయంపై నిషేధం కొనసాగుతుంది. ఈ రెండింటిలోనూ హానికర రసాయనాలు కనిపించాయి. వీటిపై ఇంకా టెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకూ ఈ నిషేధం ఉంటుంది"


- నేపాల్ ఫుడ్ డిపార్ట్‌మెంట్


ఈ రెండు బ్రాండ్స్‌కి ప్రపంచ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎన్నో దశాబ్దాలుగా భారత్‌ మధ్యప్రాచ్యంతో పాటు మరి కొన్ని దేశాలకు ఈ మసాలాని ఎగుమతి చేస్తోంది. అయితే...సింగపూర్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా అన్ని దేశాలూ ఉలిక్కిపడ్డాయి. అన్ని దేశాల్లోనూ ఈ పౌడర్‌లను పరీక్షిస్తున్నారు. న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియాలోనూ వీటి నాణ్యతపై నిఘా పెట్టారు.


"క్యాన్సర్ కారకమైన ఇథిలీన్ ఆక్సైడ్‌ అవశేషాలు ఈ పౌడర్‌లలో గుర్తించాం. ఫుడ్ స్టెరిలైజేషన్‌ కోసం ఈ కెమికల్‌ని ఎక్కువగా వినియోగిస్తారు. న్యూజిలాండ్‌తో పాటు మరి కొన్ని దేశాల్లో ఈ కెమికల్‌పై నిషేధం ఉంది. న్యూజిలాండ్‌లోనూ MDH,ఎవరెస్ట్‌ బ్రాండ్ మసాలా పౌడర్‌లు అందుబాటులో ఉన్నాయి. అందుకే వాటి నాణ్యతపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం"


- న్యూజిలాండ్ ఫుడ్‌ సేఫ్‌టీ రెగ్యులేటర్ 


ఈ ఏడాది ఏప్రిల్‌లో హాంగ్‌కాంగ్ ఫుడ్‌ సేఫ్‌టీ డిపార్ట్‌మెంట్ ఈ రెండు బ్రాండ్స్‌కి చెందిన నాలుగు ప్రొడక్ట్స్‌పై నిషేధం విధించింది. ఆ తరవాత సింగపూర్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.  Food Safety and Standards Authority of India (FSSAI) ఈ ప్రొడక్ట్స్‌ని క్వాలిటీ చెక్ చేయాలని ఆదేశించింది. హాంగ్‌కాంగ్, సింగపూర్‌ ప్రభుత్వాల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఇథిలీన్ ఆక్సైడ్‌ని పురుగుల మందులా వినియోగిస్తారు. పంటకు తెగులు పట్టకుండా ఈ రసాయనాన్నే చల్లుతారు. ఇంత ప్రమాదకరమైన కెమికల్‌ని ఏ ఆహార పదార్థాల్లోనూ వినియోగించడానికి వీల్లేదని గతంలోనే అధికారులు తేల్చి చెప్పారు. కానీ ఎన్నో దశాబ్దాలుగా మార్కెట్‌ని శాసిస్తున్న రెండు కంపెనీల మసాలాల పౌడర్‌లలో ఈ కెమికల్స్‌ని గుర్తించడమే సంచలనమవుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిషేధం విధిస్తున్నట్టు సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌తో పాటు నేపాల్ ప్రకటించడం మార్కెట్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. 


Also Read: Kerala News: వేలికి బదులుగా నాలుకకు సర్జరీ, ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం