Lok Sabha Polls 2024: ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ హ్యాట్రిక్ కొడతామన్న ధీమాతో ఉంది. హ్యాట్రిక్ కొట్టడమే కాదు. రికార్డు స్థాయిలో 400 స్థానాలు గెలుచుకుంటామని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచి ఇదే నినాదం వినిపించారు. అటు ప్రతిపక్ష కూటమి మాత్రం అధికారంలోకి వచ్చేది తామే అని అంటోంది. 400 సీట్ల సంగతి అటుంచితే. ఒకవేళ బీజేపీకి 272 సీట్లు కూడా రాకపోతే..? అప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటి..? కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకి ఇదే ప్రశ్న ఎదురైంది. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు షా. బీజేపీకి మెజార్టీ రాకపోతే అప్పుడు ఏం చేస్తారని అడగ్గా దానిపై వివరణ ఇచ్చారు. అసలు అలాంటి పరిస్థితి వస్తుందనే అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీకి అండగా కోట్లాది మంది ప్రజలు నిలబడ్డారని స్పష్టం చేశారు.
"అలాంటి పరిస్థితి మాకు వస్తుందని అనుకోవడం లేదు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన రకరకాల పథకాల ద్వారా 60 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారు. వాళ్లంతా మోదీకి అండగా ఉన్నారు. కులం,మతం, వయసుతో సంబంధం లేకుండా అందరి మద్దతూ ఉంది. ఆ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లకి తెలుసు మోదీ అంటే ఏంటో. 400 సీట్లు ఎందుకు ఇవ్వాలో. మెజార్టీ రాదనుకున్నప్పుడే ప్లాన్ బీ గురించి ఆలోచిస్తామని, కచ్చితంగా మరోసారి నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. "
- అమిత్‌షా, కేంద్రహోం మంత్రి