NCERT Political Science Book Revised: NCERT బుక్స్‌ని పూర్తి స్థాయిలో రివైజ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న పాఠాలను తొలగిస్తున్నారు. కొత్తవి చేర్చుతున్నారు. ఈ మార్పులు చేర్పుల్లో భాగంగానే బాబ్రీ మసీద్‌కి సంబంధించిన పాఠాన్ని తొలగించారు. 12వ తరగతికి చెందిన పొలిటికల్ సైన్స్‌ బుక్‌లో ఈ టాపిక్‌ని తొలగించి అయోధ్య వివాదాన్ని చేర్చడం చర్చకు దారి తీసింది. పుస్తకంలో ఎక్కడా Babri Masjid పేరు ప్రస్తావించలేదు. దానికి బదులుగా three-domed structure అని మార్చింది. అంతకు ముందు అయోధ్య వివాదానికి (Ayodhya Dispute) సంబంధించి మొత్తం నాలుగు పేజీల పాఠం ఉండేది. ఇప్పుడు దాన్ని కుదించి రెండు పేజీలకే పరిమితం చేసింది. కొన్ని కీలక వివరాలను తొలగించి రెండు పేజీలకే పరిమితం చేసినట్టు  Indian Express వెల్లడించింది.


బాబ్రీ మసీదుకు సంబంధించి ఎక్కడా ఎలాంటి వివరాలు లేకుండా మార్పులు చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొఘల్ కాలంలో 1528లో రాముడి జన్మభూమిలో బాబ్రీ మసీదు నిర్మించారని చరిత్ర చెబుతోంది. అయితే...ప్రాంతంలో హిందువులకు సంబంధించిన చిహ్నాలున్నాయని తేలింది. దీన్ని బట్టి అది హిందువులకు చెందిందే అన్న వాదన మొదలైంది. ఆ తరవాత 500 ఏళ్ల పాటు ఈ వివాదం కొనసాగింది. మొత్తానికి ఈ వివాదానికి తెర పడి రామ మందిర నిర్మాణం కూడా పూర్తైంది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించారు. NCERT బుక్‌లో బాబ్రీ మసీదుకి సంబంధించిన చరిత్రను తొలగించి కేవలం అయోధ్య వివరాలు మాత్రం ప్రచురించారు. దీనిపై NCERT డైరెక్టర్ వివరణ కూడా ఇచ్చారు. విద్యార్థులకు ఆ వివాదాల గురించి చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అందుకే తొలగించినట్టు స్పష్టం చేశారు. 


ఏమేం తొలగించారంటే..?


సోమ్‌నాథ్ నుంచి అయోధ్య వరకూ బీజేపీ చేపట్టిన రథ యాత్ర వివరాలను తొలగించారు. దీంతో పాటు రామజన్మభూమి ఉద్యమంలో కర సేవకుల పాత్ర ఏమిటన్నదీ ప్రస్తావించలేదు. 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు ధ్వంసానికి సంబంధించిన వివరాలనూ తీసేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారన్న అంశాన్నీ తొలగించారు. నిజానికి చాలా రోజులుగా ఈ బుక్‌లో మార్పులు చేర్పులు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లకి ఓ క్లారిటీ వచ్చింది. 1986లో మసీదుకి తాళం వేయడం, 1992లో ధ్వంసం చేయడం లాంటి అంశాలన్నీ గతంలో ఉన్న సిలబస్‌లో కవర్ అయ్యాయి. వీటన్నింటినీ కలిపి చిన్న పేరాకి కుదించారు. పెద్దగా ప్రస్తావించకుండా ఎడిట్ చేశారు. 


ఇక ఈ కొత్త సిలబస్‌లో అయోధ్యకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునీ ప్రస్తావించారు. లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా జరిగాయో వివరించారు. 2019 నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుని పూర్తిగా చేర్చారు. వివాదాస్పద స్థలాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కి అందిన వ్యవహారాన్నీ అందులో ప్రస్తావించారు. పాత పుస్తకంలో బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన న్యూస్ క్లిప్పింగ్స్‌, ఫొటోలు ఉండేవి. ఇప్పుడు వాటిని పూర్తిగా తొలగించారు. అసలు ఆ ప్రస్తావనే లేకుండా నేరుగా అయోధ్యకు సంబంధించిన చరిత్రను మాత్రమే ఉంచారు. 


Also Read: J&K Terror Attacks: ఉగ్రవేటను తీవ్రతరం చేయండి, అందరినీ మట్టుబెట్టండి - అమిత్ షా ఆదేశాలు