Hyderabad Mir Alam Traffic Restriction: బక్రీద్ ప్రార్థనల సందర్భంగా మాసబ్ ట్యాంకు సమీపంలోని మీర్ ఆలం దర్గా, హాకీ గ్రౌండ్, లంగర్ హౌస్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇంచార్జ్ ట్రాఫిక్ జాయింట్ సీపీ విశ్వనాథ్ ట్రాఫిక్ ఆంక్షలు వివరాలను వెల్లడించారు. బక్రీద్ నేపథ్యంలో ఉదయం నుంచి ప్రార్థనలు చేసేందుకు అధిక సంఖ్యలో ముస్లింలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ముందు ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు.


ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఇన్చార్జి ట్రాఫిక్ జాయింట్ సీపీ విశ్వనాథ్ తెలిపారు. మాసబ్ ట్యాంక్, మీర్ ఆలం దర్గా వైపు వచ్చే వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులను గుర్తించాలని పోలీసులు సూచించారు. ఈద్గాల సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల్లో ప్రార్థనలు చేసేందుకు వచ్చే ముస్లింలు వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రార్థనలకు వచ్చే వాళ్లు, వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గుర్తించాలని అధికారులు స్పష్టం చేశారు. 


రెండు రోజులపాటు పశువుల కబేళాలు మూసివేత..


బక్రీద్ పండగ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని పశువుల కబేలాలు, రిటైల్ బీఫ్ షాప్ లు రెండు రోజులపాటు మూసివేస్తున్నట్లు జిహెచ్ఎంసి అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఈ నెల 17, 18 తేదీల్లో పశువుల కబేలాలు, రిటైల్ బీఫ్ షాపులు మూసివేసేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా దుకాణాలు, కబేళాలు తెరిచినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని జిహెచ్ఎంసి అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయా షాపులు, కబేళాకు నిర్వాహకులకు నిర్వాహకులకు అధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. 


బక్రీద్ ప్రశాంతంగా జరుపుకోవాలన్న సౌత్ జోన్ డిసిపి..


బక్రీద్ పండుగ నేపథ్యంలో సౌత్ జోన్ డిసిపి కీలకమైన ప్రకటన చేశారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహ్ర సూచించారు. ఈ మేరకు పురాణిహవేలీలోని డిసిపి కార్యాలయంలో జిహెచ్ఎంసి, వాటర్ బోర్డ్, శానిటరీ, వెటర్నరీ, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో ఆమె సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. జంతు వ్యర్ధాలను ఎత్తి పెట్టడానికి అవసరమైన కవర్లను, వాటిని పారి వేయడానికి అవసరమైన టిప్పర్లు, జెసిబి వాహనాలు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చూడాలని డీసీపీ సూచించారు. ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.


ప్రశాంతమైన వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకునేలా చూడాలని కోరారు. ఇదిలా ఉంటే మీరాలం దర్గాకు భారీ సంఖ్యలో ప్రార్థనలో నిర్వహించేందుకు ముస్లింలు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే పటిష్టమైన ఏర్పాట్లను చేశారు. ప్రార్థనలు చేసేందుకు అనుగుణంగా దర్గాలో ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. నగర పరిధిలోని అనేక ప్రాంతాల నుంచి ముస్లింలు వచ్చే అవకాశం ఉంది. ముస్లింలు నిర్వహించుకునే అత్యంత పవిత్రమైన ఇస్లామిక్ పండుగ బక్రీద్. రంజాన్ తర్వాత బక్రీద్ ను ముస్లింలు అత్యంత పవిత్రంగా నిర్వహించుకుంటారు.