Guntur Kodali Nani Flexi: గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓటమితో పాటు రాష్ట్రంలోనే వైఎస్ఆర్ సీపీ దారుణ స్థాయిలో అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులకు కాస్త ఇబ్బంది కలిగించే విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హాయాంలో మంత్రి పదవుల్లో ఉన్న కొడాలి నాని, ఆర్కే రోజా, గుడివాడ అమర్ నాథ్, పేర్ని నాని లాంటి వారు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో చంద్రబాబుపై చేసిన ఛాలెంజ్‌ల కారణంగా కొడాలి నాని మాత్రం మరింత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది.


టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొడాలి నానిపై  సోషల్ మీడియాలో ట్రోల్స్, బయట నిరసనలు మామూలుగా ఉండడం లేదు. సందర్భం దొరికిన ప్రతి చోట నానిని ఇరుకున పెట్టేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తూనే ఉన్నారు. తాజాగా కొడాలి నానిపై ఫ్లెక్సీలు వెలిశాయి. దీనికి సంబంధించిన వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వైసీపీ అధికారంలో ఉండగా కొడాలి నాని టీడీపీపైన, ఆ పార్టీ అధినేత పైన పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలు అనేకం ఉన్నాయి. ఆ క్రమంలోనే ఓసారి కొడాలి నాని మాట్లాడుతూ.. ఈసారి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే.. ఆయన షూ పాలిష్ చేస్తా అంటూ ఛాలెంజ్ విసిరారు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు మాత్రమే కాక, టీడీపీ కూడా అఖండ విజయాన్ని నమోదు చేసింది. దీంతో కొడాలి నాని అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. 


ఇప్పుడు పలువురు టీడీపీ మద్దతుదారులు కొంత మంది కొడాలి నాని ఫ్లెక్సీలను తయారు చేయించి ప్రదర్శించారు. ఆయన వ్యాఖ్యలకు తగ్గట్లుగా చంద్రబాబు విజయం సాధిస్తే.. ఆయన షూ పాలిష్ చేస్తున్నట్లుగా గ్రాఫిక్స్ తో ఫ్లెక్సీలు కొట్టించి కూడళ్లలో తగిలించారు. గుంటూరులో ఈ ఫ్లెక్సీలు కనిపిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొంత మంది గుడివాడలోనూ ఈ ఫ్లెక్సీలు పెట్టించినట్లుగా ప్రచారం చేస్తున్నారు.