స్వర్ణ యుగం అంటే ఏంటో.. అసలు ఆటంటే ఏంటో... హాకీ అంటే ఏంటో ప్రపంచానికి పరిచయం చేసిన దశాబ్దాలు అవి. దేవర సినిమా టైటిల్‌ సాంగ్‌లో చెప్పినట్లు దూకే ధైర్యమా జాగ్రత్త... దేవర ముంగిట నువ్వెంత అన్నట్లు... భారత ఆటగాళ్ల ముందు ప్రత్యర్థి ఆటగాళ్ల ధైర్యం పాతాళానికి పడిపోయేది. భారత జట్టు అనే దేవర బరిలోకి దిగితే మిగిలిన జట్లన్నీ హాకీ స్టిక్‌ను దాదాపు వదిలేసేంత పనిచేసేవి. ప్రత్యర్థి జట్లను అంతా భయపెట్టిన హాకీలో దిగ్గజ ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అందులో అయిదుగురు లెజెండ్స్‌  గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుసుకుని గర్వపడదాం.. కాలర్ ఎగరేసి జై కొడదాం. ఎందుకంటే ఒలింపిక్స్‌లో భారత హాకీ చేసినన్నీ అద్భుతాలు మరే జట్టు చేయలేదు మరి...

 

ధ్యాన్‌చంద్‌(Dhyan Chand)

భారత హాకీ చరిత్రలో ధ్యాన్‌చంద్‌ను మించిన ఆటగాడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. హాకీ స్టిక్‌ను అంత కళాత్మకంగా ఉపయోగించిన మరో ఆటగాడిని ఇప్పటివరకూ హాకీ ప్రపంచం చూడలేదు. మాములు కర్రతో కూడా సునాయసంగా గోల్‌ చేయగా అతడి నైపుణ్యం చూసి నియంత హిట్లరే ఆశ్చర్యపోయారని చెప్తారు. ఆడిన రెండు ఒలింపిక్ ఫైనల్స్‌లో హ్యాట్రిక్‌ గోల్స్‌ నమోదు చేసిన ఏకైక ఆటగాడు ధ్యాన్‌చంద్‌. 1928 ఆమ్‌స్టర్‌డామ్‌ ఒలింపిక్స్‌లో 14 గోల్స్‌ చేశాడు. 1932 లాస్‌ఏంజెల్స్‌, 1936 బెర్లిన్‌ ఒలింపిక్స్‌లోనూ భారత్‌ మరో రెండు బంగారు పతకాలు గెలవడంలో ధ్యాన్‌చంద్‌ కీలక పాత్ర పోషించాడు. 1936లో ఒలింపిక్‌ పతకం గెలిచిన భారత జట్టుకు ధ్యాన్‌చంద్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఒలింపిక్ స్వర్ణాల హ్యాట్రిక్‌ను పూర్తి చేసిన రికార్డు సృష్టిస్తూ ధ్యాన్‌చంద్‌ రిటైర్డ్‌ అయ్యాడు. ధ్యాన్‌చంద్‌కు 1956లో పద్మభూషణ్ వచ్చింది. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డును కేంద్రం ఇస్తూ గౌరవిస్తోంది.

 

బల్బీర్ సింగ్ సీనియర్ (Balbir Singh Sr)

రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1944 ఒలింపిక్స్‌ రద్దయ్యాయి. ఆ తర్వాత 1948 ఒలింపిక్స్‌ నిర్వహించారు. అప్పటికే ధ్యాన్‌చంద్‌ రిటైర్డ్‌ అయ్యాడు. ఆ సమయం భారత హాకీ తన తదుపరి సూపర్‌స్టార్ కోసం వెతుకుతోంది. అప్పుడే ఆ స్టార్‌ దొరికాడు. అతడే బల్బీర్ సింగ్. హాకీ చరిత్రలో అత్యుత్తమ సెంటర్ ఫార్వర్డ్‌ ఆటగాడిగా బల్బీర్‌సింగ్‌ గుర్తింపు పొందాడు. 1948లో ఒలింపిక్స్‌లో ఎనిమిది గోల్స్‌ చేసి మరో హాకీ స్వర్ణాన్ని బల్బీర్‌ భారత్‌కు తీసుకొచ్చాడు. 1952 ఒలింపిక్స్‌ ఫైనల్‌లో ఐదు గోల్స్‌ చేసి రెండోసారి స్వర్ణాన్ని అందించాడు. 1957లో బల్బీర్‌ పద్మశ్రీని అందుకున్నాడు. 

 

మహ్మద్ షాహిద్ (Mohammad Shahid)

భారత హాకీ చరిత్రలో పెద్దగా గుర్తింపు లేని పేరు మహ్మద్ షాహిద్‌. అత్యంత నైపుణ్యం కలిగిన హాకీ ఆటగాళ్ళలో షాహిద్ ఒకడు. 1980లో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించడంలో షాహిద్‌ పాత్ర చాలా కీలకం. 1980లో హాకీలో భారత్‌కు వచ్చిన బంగారు పతకమే చివరి స్వర్ణం. షాహిద్‌ ఆటతీరును 1980 ఒలింపిక్ స్వర్ణం గెలుచుకున్న జట్టు కెప్టెన్ వాసుదేవన్ బాస్కరన్ ప్రశంసించారు. 1989లో రిటైర్డ్‌ అయిన షాహిద్‌.. 2016లో కాలేయ వ్యాధితో మరణించాడు.

 

ధనరాజ్ పిళ్లే (Dhanraj Pillay)

 ఆధునిక హాకీలో పర్యాయపదంగా మారిన హాకీ ఆటగాళ్లలో ధన్‌రాజ్‌పిళ్లై ఒకడు. భారత హాకీ చివరి తరం సూపర్ స్టార్‌గా ధన్‌రాజ్ పిళ్లేకి పేరొంది. 1989లో భారత హాకీ జట్టుకు అరంగేట్రం చేసిన పిళ్లే.... మొహమ్మద్ షాహిద్ వారసుడిగా గుర్తింపు పొందాడు. 1990లో అంతర్జాతీయ హాకీ ప్లేయర్‌లలో ఒకడిగా ఖ్యాతినార్జించాడు. 1995లో అర్జున అవార్డుతో పిళ్లేను సత్కరించారు. 1998లో భారత హాకీ జట్టు ఆసియా క్రీడల స్వర్ణం గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2003లో భారత్‌కు తొలి ఆసియా కప్ 

అందించాడు. నాలుగు ఒలింపిక్స్, నాలుగు ప్రపంచ కప్‌లు, నాలుగు ఆసియా క్రీడలు, నాలుగు ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లలో ఆడిన ఏకైక ఆటగాడిగా ధన్‌రాజ్‌ పిళ్లే రికార్డు సృష్టించాడు. 2004లో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

 

పీ.ఆర్. శ్రీజేష్ (PR Sreejesh)

భారత్‌కు పెట్టని గోడగా నిలిచిన హాకీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌. 2011 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మెరిసే ప్రదర్శనతో శ్రీజేష్‌ వెలుగులోకి వచ్చాడు. పీఆర్‌ శ్రీజేష్ నైపుణ్యాలు.. ప్రపంచంలో అగ్రశ్రేణి గోల్ కీపర్‌లలో ఒకడిగా అతడిని నిలిపాయి. శ్రీజేష్ గతంలో భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2020టోక్యో  ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శనతో భారత్ కాంస్యం గెలుచుకునేలా చేశాడు. ఈ ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల పతకాల కరువు తీరుస్తూ భారత్‌ పతకం సాధించింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022, హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు రజత పతకాన్ని సాధించడంలో శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు.