Just In





J&K Terror Attacks: ఉగ్రవేటను తీవ్రతరం చేయండి, అందరినీ మట్టుబెట్టండి - అమిత్ షా ఆదేశాలు
Jammu Kashmir Attacks: జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులపై అమిత్ షా ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు.

J&K Serial Terror Attacks: జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు అలజడి సృష్టించాయి. భద్రతా బలగాలు అన్ని చోట్లా అప్రమత్తమయ్యాయి. సున్నితమైన ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. దొడ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎత్తైన ప్రాంతాల్లో నక్కి ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. సెక్యూరిటీ సిబ్బంది ఆ ఉగ్రవాదుల్ని మట్టుబెడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్‌లోని శాంతి భద్రతలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఉగ్రవేటను మరింత తీవ్రతరం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అధికారులంతా అమిత్ షాకి జమ్ము కశ్మీర్‌లోని పరిస్థితులను వివరించారు. ఈ వివరాలన్నీ తెలుసుకున్న అమిత్ షా ఆ తరవాతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదులను ఏరి పారేయాలని తేల్చి చెప్పారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని బలగాలను రంగంలోకి దింపి ఉగ్రవాదుల్ని హతమార్చాలాని తేల్చి చెప్పారు. G7 సదస్సుకి హాజరయ్యే ముందు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు మోదీ. ఆ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చర్చించారు. ఇప్పుడు అమిత్ షా కూడా రివ్యూ చేశారు. ఈ సమావేశానికి అజిత్ దోవల్‌తో పాటు జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, కేంద్రహోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లా హాజరయ్యారు.
జూన్ 29వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపైనా సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో సరిహద్దు ప్రాంతాలపైనా నిఘా పెట్టాలని ఆదేశించారు అమిత్ షా. ఉగ్రవాదులు అక్రమంగా చొరబాట్లను అడ్డుకోవాలని తేల్చి చెప్పారు. రేసీలో ఓ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది ప్రయాణికులు చనిపోయారు. ఆ తరవాత కథువా, దొడ జిల్లాల్లోనూ ఈ దాడులు కొనసాగాయి. భద్రతా బలగాలు ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇక ముందు కూడా ఇదే స్థాయిలో ఆపరేషన్‌లు కొనసాగాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.