Electronic Voting Machines: టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌ EVMలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవి హ్యాకింగ్ అయ్యే అవకాశం ఎక్కువ అని, వాటికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎమ్‌లపై రకరకాల వాదనలు వినిపిస్తున్న సమయంలో మస్క్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కరీబియాలోని Puerto Ricoలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. అయితే...ఈ ఎన్నికల్లో EVMలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మస్క్ ఈ కామెంట్స్ చేశాడు. ఎన్నికల ప్రక్రియ నుంచి పూర్తిగా వీటిని తొలగించాలని, హ్యాకర్‌లు లేదా AI టెక్నాలజీ వీటిని హ్యాక్ చేసే ప్రమాదముందని తేల్చి చెప్పాడు. ఈ ముప్పు నుంచి బయటపడాలని అన్నాడు. వాటి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేమని వెల్లడించాడు. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్ కెన్నెడీ మేనల్లుడు రాబర్ట్ కెన్నెడీ ఈవీఎమ్‌లపై అసహనం వ్యక్తం చేశారు. ప్యుయెర్టో రికోలో జరిగిన ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని, పేపర్ ట్రయల్‌ కొనసాగుతోందని వెల్లడించారు. అయితే..పేపర్ ట్రయల్ లేని చోట పరిస్థితేంటని ప్రశ్నించారు రాబర్ట్ కెన్నెడీ. ఈవీఎమ్‌లను తొలగించి పాత పద్ధతిలోనే పేపర్ బ్యాలెట్‌లను మళ్లీ ప్రవేశపెట్టాలని సూచించారు. వేసిన ప్రతి ఓటు లెక్క కట్టేలా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని అన్నారు. అటు అమెరికాలో దీనిపై చర్చ జరుగుతుండగా మస్క్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 






నిజానికి భారత్‌లోనూ చాలా రోజులుగా ఈవీఎమ్‌ల పని తీరుపై భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు చాలా సందర్భాల్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చాయి. ప్రస్తుతానికి భారత్‌ M3 EVMలు వినియోగిస్తోంది. అంటే థర్డ్ జనరేషన్‌ మెషీన్‌లు వాడుతోంది. వీటిని ట్యాంపర్ చేయడానికి వీలుండదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటికి సేఫ్‌టీ మోడ్ ఉంటుందని వివరించింది. అయితే మస్క్ వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ఇలా జనరలైజ్ చేసి మాట్లాడడం సరికాదని మందలించారు. 


"ఇది పూర్తిగా జనరలైజ్డ్‌ స్టేట్‌మెంట్. సురక్షితమైన డిజిటల్ హార్డ్‌వేర్‌ని రూపొందించడం సాధ్యం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ముమ్మాటికీ తప్పు. బ్లూటూత్‌, ఇంటర్నెట్‌తో కానీ కనెక్షన్‌ ఉండనప్పుడు వేరే వాళ్లు వచ్చి ఎలా హ్యాక్ చేస్తారు..? ఈవీఎమ్‌లను అత్యంత సురక్షితంగా డిజైన్ చేసుకోవచ్చు. భారత్‌ ఇదే చేసింది. అవసరమైతే ట్యుటోరియల్ చెబుతాం"


- రాజీవ్ చంద్రశేఖర్, మాజీ కేంద్రమంత్రి


రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంపై స్పందించారు. EVMలు బ్లాక్‌ బాక్స్‌లు అంటూ ఆరోపించారు. వాటిని రివ్యూ చేసేందుకు ఎవరికీ అధికారం ఉండదని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగడం లేదన్న ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదని మండి పడ్డారు.




Also Read: NEET Controversy: మోదీ సర్కార్‌కి సవాల్‌గా మారిన నీట్ లీకేజీ వ్యవహారం, రాజకీయంగా రచ్చ