NEET Controversy 2024: దేశవ్యాప్తంగా NEET పై పెద్ద రచ్చ జరుగుతోంది. ఎగ్జామ్ నిర్వహించిన తీరులో లోపాలు తలెత్తడం, కొన్ని పేపర్‌లు ఆన్‌లైన్‌లో కనిపించడం లాంటివి ఆందోళనలకు దారి తీశాయి. అటు రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా NEET అభ్యర్థులు నిరసనలకు దిగారు. కేంద్రం తీరుపై తీవ్రంగా మండి పడుతున్నారు. అటు ప్రతిపక్షాలూ వీళ్లకు మద్దతునిస్తున్నాయి. నీట్‌ని ప్రవేశపెట్టినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్న DMK మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. National Testing Agency పరీక్షల వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిందని, అటు కేంద్రం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలబడి చూస్తోందని మండి పడింది. కోచింగ్ సెంటర్‌లకు అండగా నిలబడుతోందని అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. 


భారీ మొత్తంలో వసూలు..


అయితే..ఈ కేసు విచారణలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిహార్‌కి చెందిన ఓ ముఠా 35 మంది విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు తేలింది. ఒక్కొక్కరి నుంచి రూ.30-32 లక్షలు తీసుకుని పక్కా ప్లాన్ ప్రకారమే ఎగ్జామ్ పేపర్‌ని లీక్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఈ లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరోజు ముందే ఆయా విద్యార్థులకు ఎగ్జామ్ పేపర్‌ని పంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


ఎన్నో అవకతవకలు..


మే 5న దాదాపు 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాశారు. జూన్ 4న ఫలితాలు వెల్లడయ్యాయి. అదే రోజున లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే..నీట్ ఫలితాలు విడుదలయ్యాక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 67 మందికి 720 మార్కులకు 720 మార్కులు వచ్చాయి. ఇదే అనుమానాలకు దారి తీసింది. కొంత మందికి గ్రేస్ మార్క్‌లు ఇచ్చిన విషయంలోనూ అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆరోపించారు. ఈ వివాదం చివరకు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అప్పుడే కేంద్రం 1,563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్క్‌లను రద్దు చేసినట్టు స్పష్టం చేసింది. వీళ్లు రీటెస్ట్ రాయొచ్చని తేల్చి చెప్పింది. అయితే...విద్యార్థులు మాత్రం కేవలం కొంత మందికే కాకుండా అందరికీ మళ్లీ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 


దీనిపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పందించారు. పేపర్ లీక్ అయినట్టు ఎక్కడా ఆధారాలు లేవని వెల్లడించారు. సుప్రీంకోర్టుకి అన్ని వివరాలూ అందించామని, కేవలం కొందరు దీన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాత్రం తీవ్రంగా మండి పడుతున్నారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ని గందరగోళంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా పేపర్ లీక్ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. నీట్ ఎగ్జామ్‌లో స్కామ్ జరిగిందని స్పష్టం చేశారు. ఇండీ కూటమి నేతలంతా కేంద్రంపై ఇలా విమర్శలు చేస్తూనే ఉన్నారు. 


Also Read: Flesh Eating Bacteria: కండరాల్ని కొంచెం కొంచెంగా కొరికి, 48 గంటల్లో ప్రాణాలు తీసే భయంకరమైన బ్యాక్టీరియా