Flesh Eating Bacteria Spreads: కండరాన్ని కొంచెం కొంచెంగా కొరికి తినే బ్యాక్టీరియా జపాన్‌ని గడగడ వణికిస్తోంది. సోకిన 48 గంటల్లో మొత్తంగా శరీరాన్ని తొలిచేసి ప్రాణాలు తీసేస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త కొవిడ్‌ భయం నుంచి కోలుకుంటుండగా ఇప్పుడు కొత్తగా flesh-eating bacteria కలవర పెడుతోంది. Bloomberg వెల్లడించిన వివరాల ప్రకారం ఈ జబ్బు పేరు Streptococcal toxic shock syndrome.ఈ బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమైందంటే సోకిన రెండు రోజుల్లోనే మొత్తం శరీరాన్ని పీల్చి పిప్పి చేసేస్తుంది. జూన్ 2వ తేదీ నాటికి జపాన్‌లో దాదాపు 977 కేసులు నమోదయ్యాయి. గతేడాది కూడా ఈ బ్యాక్టీరియా సోకి దాదాపు 941 మంది తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ సారి బాధితుల సంఖ్య పెరగడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. 1999 నుంచి జపాన్‌లో ఈ బ్యాక్టీరియా అప్పుడప్పుడు ఇలా భయపెడుతూనే ఉంది. ఈ వ్యాధి సోకిన వారికి శరీరమంతా వాపులు వస్తున్నాయి. ఇక చిన్నారులకు గొంతు నొప్పి వేధిస్తోంది. మరి కొందరిలో లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటున్నాయి. కండరాల వాపుతో పాటు తీవ్ర జ్వరం, లో బీపీ సతమతం చేస్తున్నాయి. శ్వాస తీసుకోవడానికీ ఇబ్బంది పడుతున్నారు కొందరు బాధితులు. 


ఇంకా ఆందోళనకరమైన విషయం ఏంటంటే కొందరిలో అవయవాలు పూర్తిగా పాడైపోతున్నాయి. అదే చివరకు మరణానికి దారి తీస్తోంది. ఇదంతా 48 గంటల్లోనే జరిగిపోతోంది. ఇదే విషయాన్ని వైద్యులూ చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా సోకిన వాళ్లలో కొందరు అరికాళ్లకు విపరీతంగా వాపులు వచ్చేస్తున్నాయి. ఆ తరవాత కొద్ది గంటల్లోనే ఆ వాపులు శరీరమంతా వ్యాపిస్తున్నాయి. 50 ఏళ్లు పైబడిన వాళ్లు డేంజర్‌ జోన్‌లో ఉన్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న స్థాయిలో వ్యాప్తి చెందితే ఏడాది ముగిసే నాటికి కనీసం 2,500 కేసులు నమోదయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా మరణ రేటు 30% వరకూ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేసింది. గాయాలైతే వెంటనే అవసరమైన చికిత్స తీసుకోవాలని వెల్లడించింది. అయితే...జపాన్‌తో పాటు మరి కొన్ని దేశాల్లోనూ ఈ సిండ్రోమ్‌ వెలుగు చూసింది. ఐరోపా దేశాల్లోనూ గతంలో ఈ కేసులు నమోదయ్యాయి.