Income Tax Return Filing 2024: ఆర్థిక సంవత్సరం 2023-24 లేదా మదింపు సంవత్సరం 2024-25 కోసం ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే ముందు, పన్ను చెల్లింపుదార్లు (Taxpayers) కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. పోర్టల్‌లో మీ వ్యక్తిగత వివరాలను అప్‌డేటెడ్‌గా ఉంచడం, అంటే పాత వివరాలు కాకుండా కొత్త వివరాలు ఉండేలా చూసుకోవాలి. గతంలో ఐటీఆర్‌ ఫైల్‌ (IT Return Filing) చేసిన సమయానికి, ఇప్పటికి పన్ను చెల్లింపుదారు చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలు మారి ఉండొచ్చు. ఇలాంటి కేస్‌లో, మారిన సమాచారాన్ని సమయానికి పోర్టల్‌లో నవీకరించాలి.


ఆదాయ పన్ను పోర్టల్‌లో ఏయే వివరాలను అప్‌డేట్ చేయవచ్చు?


ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లోకి లాగిన్ అయి (https://eportal.incometax.gov.in/iec/foservices/#/login) మీ ఫొటో, చిరునామా, మొబైల్ నంబర్ సహా కొన్ని వివరాలను అప్‌డేట్ చేయొచ్చు. ఈ వివరాలను మై ప్రొఫైల్/అప్‌డేట్ ప్రొఫైల్ ఆప్షన్స్‌ కింద.. పాన్, టాన్, ఆధార్ నంబర్ ద్వారా అప్‌డేట్ చేయవచ్చు. బ్యాంక్ వివరాల ద్వారా మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ID, చిరునామాను నవీకరించవచ్చు.


ఆదాయ పన్ను పోర్టల్‌లో వ్యక్తిగత వివరాలను ఇలా అప్‌డేట్ చేయండి


-- ముందుగా, https://eportal.incometax.gov.in/iec/foservices/#/login ద్వారా ఆదాయ పన్ను పోర్టల్‌ లాగిన్‌ పేజ్‌లోకి వెళ్లాలి.
-- ఇక్కడ యూజర్ ఐడీ (పాన్‌), పాస్‌వర్డ్ ద్వారా పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.
-- హోమ్‌ పేజీలో, కుడి వైపు పైన మీ పేరు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయగానే డ్రాప్‌ డౌన్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో మై ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
-- ఈ పేజీలో ఎడమవైపు పైభాగంలో మీ పేరు, ఫొటో కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ మీ ఫొటో లేకపోయినా, పాత ఫొటో ఉన్నా.. అక్కడే కనిపించే కెమెరా గుర్తుపై క్లిక్ చేసి కొత్త ఫోటోను అప్‌లోడ్ చేయవచ్చు.
-- పౌరసత్వం, చిరునామా, పాస్‌పోర్ట్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను నవీకరించవచ్చు.
-- మీ ఆదాయ వనరులు, బ్యాంక్ ఖాతా వివరాలు, డీమ్యాట్ ఖాతా వివరాలు మొదలైన సమాచారాన్ని కూడా ఈ పేజ్‌లో అప్‌డేట్ చేయవచ్చు.


ఆధార్, పాన్ సాయంతో మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి


-- దీని కోసం, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని మై ప్రొఫైల్ పేజీలోకి వెళ్లండి.
-- ఆ పేజీలో కాంటాక్ట్ డిటైల్స్ కనిపిస్తాయి, పక్కనే ఎడిట్‌ బటన్‌ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
-- మీ ఆధార్, పాన్ లేదా బ్యాంక్ ఖాతా ప్రకారం మీ కొత్త మొబైల్ నంబర్‌ని నమోదు చేయండి.
-- మీరు ఏ ఆప్షన్‌ ఎంచుకోవాలనుకుంటే ఆ బటన్‌ మీద క్లిక్ చేయండి.
-- ధృవీకరణ (అథెంటికేషన్‌) కోసం OTP మీ రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ IDకి వస్తుంది.
-- 6 అంకెల OTPని అక్కడ నమోదు చేయండి.
-- బ్యాంక్ వివరాల ద్వారా ధృవీకరణ పూర్తి చేయదలిస్తే, మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్‌ చేయండి.
-- ఇక్కడితో ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో అప్‌డేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.


వివరాలను అప్‌డేట్‌ చేసిన తర్వాతే ఆదాయ పన్ను పత్రాలు సమర్పించడం మంచిది. ఐటీ రిటర్న్‌ దాఖలు చేయడానికి జులై నెల చివరి వరకు సమయం ఉంది.


మరో ఆసక్తికర కథనం: మీ గ్రేట్‌ డాడ్‌ను ఆశ్చర్యపరిచే 7 గిఫ్ట్‌లు - లాస్ట్‌ మినిట్‌ ఐడియాలివి