డిగ్రీ, ఓ పట్టాలా మిగిలిపోకూడదు: ప్రధాని మోదీ


జాతీయ విద్యా విధానంతో యువతలో నైపుణ్యాలు పెరుగుతాయని, వారికి నచ్చిన కోర్స్‌లు చదువుకునేందుకు అవకాశం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారణాసిలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-NEP అమలుకు సంబంధించి మూడు రోజుల అఖిల భారత శిక్షా సమాగమం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్‌లో 300 మంది అకాడమిక్, అడ్మినిస్ట్రేటివ్, ఇన్‌స్టిట్యూషనల్ లీడర్స్‌ పాల్గొంటున్నారు. 
యూత్‌ డిగ్రీ చేస్తే, వాళ్ల చేతిలో అది కేవలం ఓ పట్టాలా మారిపోకూడదని,మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలబడేలా ఉండాలని వెల్లడించారు. 
ఎన్‌ఈపీతో ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. "మన దేశ యువత నైపుణ్యవంతులుగా మారాలి. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ప్రాక్టికల్స్‌లోనూ మెరవాలి. ఇవన్నీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో సాధ్యమవుతాయి" అని వెల్లడించారు ప్రధాని మోదీ. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పని చేసే యువత కోసం అన్ని సంస్థలూ ఎదురు చూస్తున్నాయని చెప్పారు. 


కొత్త విద్యా విధానంతో ఆలోచనలు విస్తృతం..



మునుపెన్నడూ లేని విధంగా స్పేస్ టెక్నాలజీలోనూ యువత తమ నైపుణ్యాన్ని చాటుతోందని స్పష్టం చేశారు. ఎంతో మంది ఈ టెక్నాలజీవైపు
అడుగులు వేస్తున్నారని అన్నారు. మహిళలకూ కొత్త అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. కొవిడ్‌ సంక్షోభం ఇబ్బందులు పెట్టినప్పటికీ..
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఉందని వెల్లడించారు. స్టార్టప్ ఇకో సిస్టమ్‌లో మూడో 
అతి పెద్ద దేశంగా భారత్ అవతరించిందని అన్నారు. దాదాపు మూడు దశాబ్దాల తరవాత కొత్త విద్యా విధానానికి రూపకల్పన జరిగిందని,
యువతను మైరుగ్గా మార్చేందుకు అన్ని అవకాశాలనూ అందిపుచ్చుకోవాలని సూచించారు. బ్రిటిషర్లు రూపొందించిన విద్యా విధానం
భారత్ అవసరాలకు అనుగుణంగా లేదని అభిప్రాయపడ్డారు. కొత్త విద్యా విధానంతో ఆలోచనలు విస్తృతమవుతాయని చెప్పారు. 


ఆయుర్వేద శాస్త్రంపై అధ్యయనం జరగాలి..


"ల్యాబ్ టు ల్యాండ్" పద్ధతిలో మన యువతను తీర్చి దిద్దాలని, ఇదే విషయాన్ని గుర్తించి విద్యాసంస్థలు ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియెన్స్ అందించటంపై దృష్టిసారించాలని ప్రధాని మోదీ సూచించారు. ఆయుర్వేద లాంటి శాస్త్రాలనూ అధ్యయనం చేయాల్సిన అవసరముందని చెప్పారు. పర్యావరణ మార్పులు, వ్యర్థాల రీసైక్లింగ్, పరిశుభ్రత లాంటి అంశాల్లోనూ పరిశోధనలు చేయాలని సూచించారు. రెండేళ్ల క్రితమే
ఎన్‌ఈపీ అమలుకు ఆమోదం తెలిపినప్పటికీ, పూర్తిస్థాయిలో ఇది అమలవ్వాల్సి ఉందని చెప్పారు. అందుకే ప్రధాని మోదీ పలు సెమినార్లు, 
వర్క్‌షాప్‌లకు హాజరవుతూ ఈ అంశంపై చర్చిస్తున్నారు. కొత్త విద్యాసంస్థల ఏర్పాటుపైనా దృష్టి సారించింది కేంద్రం. 2014 తరవాత 
మెడికల్‌ కాలేజీల సంఖ్య దాదాపు 55% మేర పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కోసం కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-CETని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక కొత్త విద్యా విధానంలో విద్యార్థులు, మాతృభాషలో చదువుకునే వెసులుబాటు ఉంది.