ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో సంచలనానికి తెర తీశారు. తమ పార్టీని బలోపేతం చెయ్యడానికి వైజాగ్ నుండి  కారు యాత్ర చేపట్టనున్నట్టు ఆయన పార్టీకి చెందిన స్టేట్ కో ఆర్డినేటర్ సుస్మిత తెలిపారు.  జులై 9 న వైజాగ్ లో ప్రారంభమయ్యే కేఏ పాల్ కారు యాత్ర విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం మీదుగా జులై 22 నాటికి  కర్నూలు చేరుకుంటుంది అని ఆమె తెలిపారు. ఈ మార్గం మధ్యలో ఏర్పాటు చేసిన పలు వేదికల వద్ద ప్రజలతో కేఏ పాల్ మాట్లాడనున్నారని, తమ పార్టీ ఆశయాలు, ఉద్దేశ్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారిని తమ పార్టీ వైపు వచ్చేలా చేస్తామని ప్రజాశాంతి పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు.


పాల్ రావాలి -పాలన మారాలి : కారు యాత్ర నినాదం


ఈ యాత్ర కు కేఏ పాల్ "పాల్ రావాలి -పాలన  మారాలి " అనే నినాదాన్ని ఫిక్స్ చేసారు. నిన్నమొన్నటి వరకూ తెలంగాణలో హల్ చల్ చేసిన కేఏ పాల్ ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ ను కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పడు తాజాగా తన దృష్టిని ఏపీపై పెట్టారు. ఆంధ్రాలో కారు యాత్రతో జనాన్ని తమ పార్టీ వైపు పెద్ద ఎత్తున ఆకర్షిస్తానని ఆయన అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి యాత్ర లు ఆయన చేపట్టినా.. రాష్ట్రం మొత్తం ఒకే విడతలో ఎప్పుడూ టూర్ చేయ్యలేదు. దానితో ఆయన కారు టూరు పై ఆసక్తి నెలకొంది. 


తెలంగాణలో కూడా కారు  యాత్ర


ఏపీలో టూర్ ముగిసిన తరువాత తెలంగాణలో కూడా కారు యాత్ర చేపడతానంటున్నారు కేఏ పాల్. జులై 23 నుండి ఆగస్టు ఒకటి వరకూ తెలంగాణలో కూడా ఆయన  పర్యటిస్తారని,సెప్టెంబర్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారని ఆయన ప్రతినిధులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పాలనా బాగోలేదని, అవినీతి పెరిగిపోయిందని, ఈ పరిస్థితి మారాలంటే కేఏ పాల్ అధికారంలోకి రావాలని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఆ నినాదంతోనే కారు యాత్ర చేపడతారని ఆయన ప్రతినిధులు అంటున్నారు. మొత్తమ్మీద ఎప్పుడు, ఏ సంచలనం సృష్టిస్తారో తెలియని కేఏపాల్ లేటెస్ట్ గా చేపడుతున్న కారు యాత్రకు పబ్లిక్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఓ రెండు రోజులు ఆగాల్సిందే..!