YSRCP Plenary 2022 : వైసీపీ ప్లీనరీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఈనెల 8, 9 తేదీల్లో 16వ జాతీయ రహదారిపై వాహనాలు దారిమళ్లిస్తున్నట్టు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా, గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ ప్రకటించారు. వైసీపీ ప్లీనరీ కారణంగా జాతీయ రహదారిపైకి ఇతర వాహనాలు రాకుండా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలను ప్రకాశం జిల్లా త్రోవగుంట నుంచి దారి మళ్లిస్తున్నారు. చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వాహనాదారులు వెళ్లాల్సి ఉంటుంది. 


వాహనాల దారి మళ్లింపు


గుంటూరు నుంచి విశాఖ వెళ్లే వాహనాలను బుడంపాడు మీదుగా తెనాలి, కొల్లూరు, పెనుమూడి వారధి, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా దారిమళ్లిస్తారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి దారిమళ్లించి గుడివాడ మీదుగా అవనిగడ్డ, రేపల్లె, చీరాల మీదుగా ఒంగోలు వెళ్లేలా ట్రాఫిక్ మళ్లించారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నూజివీడు మీదుగా ఇబ్రహీంపట్నం వైపు దారిమళ్లిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖ వెళ్లే వాహనాలు ఇబ్రహీంపట్నం వద్ద దారి మళ్లించి హనుమాన్‌ జంక్షన్‌ వైపు వెళ్లాలని పోలీసులు సూచిస్తు్న్నారు. చెన్నై వైపు నుంచి విశాఖ వైపు వెళ్లే భారీ వాహనాలు చిలకలూరిపేట, ఒంగోలు వద్ద జాతీయ రహదారిపై నిలిపివేయనున్నారు.  


ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్


విశాఖ వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు హనుమాన్ జంక్షన్‌, పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద నిలిపివేయనున్నారు. రాత్రి 10 గంటల తర్వాత భారీ వాహనాలను జాతీయ రహదారిపైకి అనుమతించనున్నారు. వైసీపీ ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్‌ కోసం కూడా పోలీసులు ఏర్పాట్లుచేశారు. విజయవాడ నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులు కాజా టోల్‌ప్లాజా వద్ద రామకృష్ణ వెనూజియాలో, కార్లు, బైక్ లు నాగార్జున యూనివర్సిటీలో పార్కింగ్‌ చేయాలని తెలిపారు.  గుంటూరు నుంచి వచ్చే బస్సుల్ని నంబూరు, కంతేరు రోడ్డుపై, కార్లు, బైక్ లను కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్, రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన పార్కింగ్ స్థలాలు కేటాయించినట్టు పోలీసులు పేర్కొన్నారు.


Also Read : YSRCP Plenary 2022 : ప్లీనరీ సక్సెస్ చూసి చంద్రబాబు మళ్లీ బోరు బోరున ఏడుస్తారు - ఎంపీ విజయసాయి రెడ్డి